విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రులు అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస రావు తీవ్రంగా స్పందించారు. పవన్ పచ్చి పీక్ స్టేజ్ కు చేరిందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. వైసిపి వంద రోజుల పాలన చూస్తుంటే పారదర్శకత, దార్శనికత లోపించినట్లు కనిపిస్తోందని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మాటలు పవన్ కల్యాణ్ నోట్లోంచి వస్తున్నాయని ఆయన శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో అన్నారు. జననేతగా ఎదుగుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లడం ఆకాశంపై ఉమ్మేయడమేనని ఆయన అన్నారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినా పవన్ కల్యాణ్ కు బుద్ధి రాలేదని ఆయన అన్నారు. 

పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మరో మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రంగా ప్రతిస్పందించారు. పవన్ తన గౌరవాన్ని తగ్గించుకునే విధంగా మాట్లాడవద్దని ఆయన హితవు పలికారు. పవన్ అంటే తనకు గౌరవం ఉందని, దయచేసి దాన్ని పోగొట్టుకోవద్దని ఆయన శనివారం విశాఖలో మీడియా ప్రతినిధులతో అన్నారు. పవన్ కల్యాణ్ టీడీపి రాసిన స్క్రిప్టును చదివి వినిపించారని ఆయన అననారు. 

నవరత్నాలకు అనుకూలమో వ్యతిరేకమో పవన్ కల్యాణ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని తాము చెప్పామని, దానికి పవన్ కల్యాణ్ అనుకూలమో వ్యతిరేకమో చెప్పాలని ఆయన అన్నారు. 

గతంలో మంగళగిరిలో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్ లపై చేసిన విమర్శలను పవన్ కల్యాణ్ మరిచిపోయారా అని అవంతి అడిగారు. టీడీపి ట్రాప్ లో పడవద్దని ఆయన హితవు చెప్పారు. ఓటేసిన గాజువాక ప్రజలను ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ ఒక్కసారైనా కలిశారా అని అడిగారు.