తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులంతా ఇసుక మాఫియాలో ఉన్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ఆరోపణలను మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు కొట్టిపారేశారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులంతా ఇసుక మాఫియాలో ఉన్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ఆరోపణలను మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు కొట్టిపారేశారు. పవన్ కల్యాణ్ చేసినవన్నీ ఆధారాల్లేని ఆరోపణలేనని అన్నారు. పవన్‌ రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలెవరికీ ఇసుక క్వారీలు లేవని స్పష్టం చేశారు. 

తాను కూడా ఓ ఎమ్మెల్యేనని అంటూ తనకూ క్వారీ ఉందని నిరూపించగలరా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు జూలై నెలాఖరులోగా జీపీఎస్‌ ట్రాకింగ్‌ విధానాన్ని అమలులోకి తెస్తున్నట్లు ఆయన గురువారం మీడియా సమావేశంలో తెలిపారు. 

ఇసుక రీచ్‌లు మాఫియా చేతుల్లో ఉన్నాయంటూ ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శల్లో నిజం లేదని అన్నారు. రాష్ట్రంలో 150 ఇసుక రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణాను నియంత్రించేందుకు జాతీయ రహదారులపై 23, రాష్ట్ర ముఖ్య రహదారులపై 31 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 

అక్రమ రవాణాపై ఇప్పటికే 154 ఫిర్యాదులు వచ్చాయని, అక్రమంగా నిల్వ చేసిన లక్షా 13 వేల క్యూబిక్‌ మీటర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి 1773 లీజులను తనిఖీ చేయించామని, వాటిలో అక్రమాలకు సంబంధించి 643 కేసులు నమోదుచేసి నోటీసులు జారీ చేశామని చెప్పారు.