వరి రైతులు సోమరులు అంటూ మంత్రి రంగనాథరాజు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు కౌలు రైతులు. కష్టపడి పండించే రైతులు సోమరిపోతుల్లా  కనిపిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

శనివారం పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో జరిగిన కృషి విజ్ఞానకేంద్రం రజతోత్సవంలో మంత్రి రంగనాథరాజు.. ‘వరి ఒక సోమరిపోతు వ్యవసాయం’ అంటూ వ్యాఖ్యానించారు. బయటి జిల్లాలకు వెళ్లినప్పుడు రైతులకు తాను ఇదే విషయం చెబుతుంటానని తెలిపారు.

మరోవైపు మంత్రి వ్యాఖ్యలపై రైతులు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అన్ని వైపులా విమర్శలు రావడంతో మంత్రి రంగనాథరాజు .. రైతులకు క్షమాపణలు చెప్పారు.

ప్రభుత్వం ఇచ్చే పథకాలు భూ యజమానులు అనుభవిస్తున్నారని.. తుఫాను కారణంగా కౌలు రైతులు పూర్తిగా నష్టపోయారని ఆయన చెప్పారు. ఆ ఉద్దేశంతో తాను మాట్లాడటం జరిగిందని.. అంతే తప్పించి తాను వ్యవసాయన్ని కించపరచాలనో, రైతుల మనోభావాలను దెబ్బతీయాలని మాట్లాడలేదని మంత్రి వివరణ ఇచ్చారు.

తాను కూడా రైతు బిడ్డనేనని.. అన్ని రకాల వ్యవసాయాలను చేస్తున్నానని స్పష్టం చేశారు. కౌలు రైతులు పడుతున్న ఇబ్బందులపై తాను పడుతున్న ఆవేదనను తెలియజేయడంలో తొందరపడ్డానని రంగనాథరాజు చెప్పారు.