కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. విభజన సమస్యలకు ఈసారి బడ్జెట్‌లో పరిష్కారం లభిస్తుందని తాము ఆశించామని, కానీ బడ్జెట్‌ నిరాశ కలిగించిందని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో ఒకట్రెండు రోజుల్లో నిర్ణయాలుంటాయని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై మంత్రులతో సీఎం చంద్రబాబు సమావేశం ముగిసిన తర్వాత సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్‌లో  రాజధానికి సైతం నిధులు ఇవ్వలేదని, 13 షెడ్యూల్‌లోని సంస్ధలకూ అరకొర నిధులు విదిలించారని సోమిరెడ్డి అన్నారు. రాష్ట్ర కేబినెట్‌ భేటీలోనూ కేంద్రం తీరుపై చర్చిస్తామని చెప్పారు. పార్లమెంటరీ పార్టీ భేటీలోనూ ఈ విషయాన్ని గట్టిగానే మాట్లాడుతామన్నారు. ముంబై, బెంగళూరుల మీదున్న ప్రేమ అమరావతిపైనా కేంద్ర ప్రభుత్వం చూపాల్సిన అవసరముందన్నారు. ఏవో కొద్దిగా చేసి.. ఏదేదో చేసేశామని కేంద్రం ఇన్నాళ్లూ చెప్పుకొచ్చిందని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌లో అసలు ఏపీ ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. ఇన్నాళ్లు వేచిచూశాం ప్రజల ఆకాంక్షలు నెరవేరకుంటే అవసరమైన నిర్ణయం తీసుకుంటాం కాస్త ఓపికి పట్టండి అంటూ పెద్ద హెచ్చరికే చేశారు.