తెలంగాణలో వుండి కాదు.. ఏపీకి వచ్చి మాట్లాడు : హరీశ్ రావుకు మంత్రి అప్పలరాజు సవాల్
హరీశ్ రావుకు దమ్ముంటే ఏపీకి వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు. కూతురు, కొడుకు, అల్లుడు ఇలా కుటుంబం అంతా పాలించడానికి ఏపీ ఏమీ తెలంగాణ కాదన్నారు.
ఏపీ ప్రభుత్వం, పాలనపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హరీశ్‌రావుపై ఏపీ మంత్రులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. తాజాగా మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌లో టీ తీసి బీసీ పెట్టినంత మాత్రాన ఏం కాదన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు ఆంధ్రా ప్రజలవి కావా అని మంత్రి నిలదీశారు. జాతీయవాదం లేదని టీఆర్ఎస్ .. బీఆర్ఎస్‌గా ఎలా మారుతుందని అప్పలరాజు ప్రశ్నించారు. కూతురు, కొడుకు, అల్లుడు ఇలా కుటుంబం అంతా పాలించడానికి ఏపీ ఏమీ తెలంగాణ కాదన్నారు. ఇక్కడి సమాజం కుటుంబ పాలనను అంగీకరించదని అప్పలరాజు చురకలంటించారు.
తెలంగాణలో ఆధార్ కార్డ్, ఓటు కార్డ్ చేసుకోండని అక్కడివాళ్లు అడుక్కుంటున్నారని అప్పలరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ, ఒడిషాల నుంచి ఏపీకి చాలా మంది వస్తున్నారని.. ఏపీ గురించి మాట్లాడాలంటే ఇక్కడికి వచ్చి మాట్లాడాలంటూ హరీశ్ రావుకు మంత్రి సవాల్ విసిరారు. మా గ్రామాలు, మా పాఠశాలలు ఎలా ఉన్నాయో వచ్చి చూడాలని అప్పలరాజు చురకలంటించారు. ఎన్నికల ముందు దళితబంధు అంటే నమ్మడం లేదననారు. బీఆర్ఎస్‌కు తెలంగాణలోనూ జనం బుద్ధి చెబుతారని అప్పలరాజు జోస్యం చెప్పారు. ఏపీలో ఆ పార్టీకి ఎప్పటికీ అడ్రస్ ఏర్పడదన్నారు. ఆంధ్రా కుండ బిర్యానీని, గోదావరి రుచుల్ని బీఆర్ఎస్ నేతలు అవమానించారని మంత్రి గుర్తుచేశారు. అలాంటి వారిని ఏపీ ప్రజలు అంగీకరించరని, విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఎలా కాపాడుకోవాలో జగన్‌కు తెలుసునని అప్పలరాజు పేర్కొన్నారు.
ALso Read: మీ సంగతి మీరు చూసుకోండి.. ఏపీ గురించి నీకెందుకు : హరీశ్‌రావుకు బొత్స సత్యనారాయణ కౌంటర్
అంతకుముందు మంత్రి బొత్స సత్యనారాయణ సైతం హరీశ్ రావుకు కౌంటరిచ్చారు. హరీష్ రావు రాజాకీయాల కోసం ఏదైనా మాట్లాడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్‌రావుకు ఏపీ గురించి మాట్లాడడానికి ఏం సంబంధం వుందని బొత్స ప్రశ్నించారు. రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడడానికి హరీష్ రావు ఎవరని ఆయన నిలదీశారు. బాధ్యత గల వ్యక్తులు బాధ్యత గుర్తెరిగి మాట్లాడాలని బొత్స సత్యనారాయణ హితవు పలికారు. మా రాష్ట్రం గురించి మాకు తెలుసునని.. మీ రాష్ట్రం గురించి మీరు చూసుకోవాలని బొత్స చురకలంటించారు.
ఇదిలా ఉంటే, హరీష్ రావు మంగళవారం మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి ఇక్కడి నిర్మాణ రంగంలో పనిచేస్తున్న వలస కార్మికులు ఇక్కడే (తెలంగాణలో) వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పాటుపడుతోందని చెప్పారు. ఏపీ, తెలంగాణకు భూమి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందని కూడా అన్నారు. ‘‘ఏపీతో పోలిస్తే తెలంగాణలోని ఆసుపత్రులు, ఇతర ప్రాంతాల్లో రోడ్లు, సేవలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ బాగా తెలుసు’’ అని కూడా హరీష్ రావు కామెంట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాలను వినియోగించుకోవడానికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు కాకుండా కేవలం తెలంగాణలోనే ఉండేలా చూసుకోవాలని సూచించారు.