నీ తండ్రిని పంచె ఊడదీసి కొడతానన్నాడు... అతడితో మిలాకతా..! : షర్మిలపై రోజా సీరియస్
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీకి చంద్రబాబు నాయుడే కారణమని రోజా అన్నారు. ఆయన స్క్రిప్ట్ ప్రకారమే షర్మిల మాట్లాడుతున్నారని...లేదంటే సొంత అన్నని తిట్టాల్సిన అవసరం ఆమెకు ఏముంటుందన్నారు. షర్మిల రాజకీయాలపై రోజా సెటైర్లు వేసారు.
విశాఖపట్నం : 'వినేవాడు వెర్రివాడయితే చెప్పేవాడు వేదాంతి అట' కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీరు ఇలాగే వుందంటూ మంత్రి రోజా ఎద్దేవా చేసారు. తెలంగాణలో రాజకీయ పార్టీపెట్టి సరిగ్గా ఎన్నికల సమయానికి పోటీనుండి తప్పుకున్నారు... ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు చేస్తానంటున్నారని సెటైర్లు వేసారు. గతంలో ఇదే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిల ఇప్పుడు వారి డైరెక్షన్ లోనే పనిచేస్తున్నారని అన్నారు. షర్మిల మాటల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని... ఆమెవన్నీ టైంపాస్ రాజకీయాలేనని రోజా అన్నారు.
రేవంత్ రెడ్డిని టిడిపి కోవర్ట్ అన్నది ఇదే షర్మిల... ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చి రేవంత్ సీఎం అయ్యేందుకు సహకరించిందని రోజా అన్నారు. ఏం మొహం పెట్టుకుని తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని నిలదీసారు. చివరకు తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పంచె ఊడదీని కొడతానన్న పవన్ కల్యాణ్ ను షర్మిల కలవడం బాధాకరమన్నారు. పవన్ ఇంటికి వెళ్లిమరీ కొడుకు పెళ్లి ఆహ్వానపత్రిక ఇవ్వడాన్ని బట్టే వైఎస్సార్ పై ఆమెకు ఎంత అభిమానముందో అర్థమవుతుందన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు తండ్రీకొడుకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ మాటలు నమ్మే పరిస్థితి లేదని రోజా అన్నారు. ఇక చాలారోజులుగా పవన్ పసలేని ఉపన్యాసాలు విని బోర్ కొట్టింది... ఇది తెలుసుకునే షర్మిలను రంగంలోకి దింపారన్నారు. షర్మిల మాట్లాడే ప్రతిమాట చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టేనని పర్యాటక మంత్రి పేర్కొన్నారు. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ అనే తప్ప షర్మిలకు ఏం గుర్తింపు వుంది? అని రోజా ప్రశ్నించారు.
Also Read చంద్రబాబు లగ్జరీ చూసి ప్రధానే ఆశ్చర్యపోయేవారు... తమతో ఇలాగనేవారు..: కేశినేని నాని
చంద్రబాబు డర్టీ పొలిటీషన్ ... అతడి నీచ రాజకీయాల వల్లే రాష్ట్రం అభివృద్దికి నోచుకోలేదని రోజా మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుపరిపాలన సాగుతోందని... రాష్ట్ర అభివృద్ది పరుగులు తీస్తోందని రోజా అన్నారు. కులం, మతం, ప్రాంతం అనే తేడా చూడకుండా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇది చూసి ఓటమిభయం పట్టుకున్న ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు, నోటికొచ్చిన విమర్శలు చేస్తున్నారని రోజా మండిపడ్డారు.
కేవలం రాజకీయ లబ్ది కోసమే గతంలో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారని రోజా అన్నారు. ఇప్పుడు మళ్లీ బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీకి రెడీ అయ్యాడన్నారు. వైసిపిని ఒంటరిగా ఎదుర్కోలేకే ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం చంద్రబాబుకు అలవాటేనని మంత్రి రోజా ఎద్దేవా చేసారు.