బామ్మర్దిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా?.. చంద్రబాబుపై రోజా సంచలనం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల అంశం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని.. వాటిని ఆయన గానీ, టీడీపీ నాయకులకు గానీ ఎందుకు స్పందించడం లేదని ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు అవినీతి పరుడని.. ఐటీ నోటీసులతో అది మరోసారి రుజువైందని ఆరోపణలు చేస్తున్నారు. మంత్రి రోజా కూడా ఈ విషయంలో చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని కూడా రోజా ప్రశ్నిస్తున్నారు. పవన్ మూతికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు.
అంతేకాకుండా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరిపై కూడా రోజా విమర్శలు చేశారు. పురందేశ్వరి బీజేపీ అధ్యక్షురాలో లేక బాబు బీజేపీ అధ్యక్షురాలో తెలియడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చిన విషయంపై దగ్గుబాటి పురందేశ్వరి ఎందుకు మాట్లాడటం లేదని రోజా ప్రశ్నించారు.
అయితే తాజాగా రోజా తన విమర్శల దాడిని మరింతగా పెంచారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుపై ప్రశ్నలు సంధించారు. ‘‘ముడుపుల కేసులో .... ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా..? లేక... బామ్మర్దిలా .... మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ?, రామోజీలా .... మంచం ఎక్కుతాడా ?, అచ్చన్నలా .... రమేష్ ఆసుపత్రిలో చేరతాడా ?, విజయ్ మాల్యాలా..... విదేశాలకు పారిపోతాడా ?, ఇవన్నీ కాక ఎప్పటిలానే .... మరో స్టే తెచ్చుకుంటాడా ?, అని ...పలువురు గుసగుస !’’ అని రోజా ఎక్స్(ట్విట్టర్)లో పోస్టు చేశారు.
అయితే బామ్మర్దిలా అంటూ హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణను ఉద్దేశించి రోజా తన పోస్టులో ప్రస్తావించడంపై ఆయన అభిమానులు మండిపడుతున్నారు.