సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తాను విమర్శించలేదని ఏపీ మంత్రి  రోజా అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా రజనీకాంత్ చేసిన  వ్యాఖ్యలను  తాను విమర్శించలేదని.. ఖండించానని  చెప్పారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను తాను విమర్శించలేదని ఏపీ మంత్రి రోజా అన్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను తాను విమర్శించలేదని.. ఖండించానని చెప్పారు. మంత్రి రోజా ఈరోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రోజా మీడియాతో మాట్లాడారు. రజినీకాంత్‌ను తాను విమర్శించలేదని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడితే బాగుండేదనని అన్నానని తెలిపారు. ’‘చంద్రబాబుకి ఓటేసి గెలిపించండి.. ఏపీని ఇండియాలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకొస్తారు’’ అని రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలను ఖండించానని చెప్పారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేయలేదని.. అలాంటి వ్యక్తి గురించి రజనీకాంత్ గొప్పగా మాట్లాడితే ఆయన ఇమేజ్ దిగజారిపోతుందని మాట్లాడటం జరిగిందని అన్నారు. 

తమిళనాడులో ఎవరినో ఉద్దేశించి సినిమా ఫంక్షన్‌లో రజనీకాంత్‌ మాట్లాడితే.. ఆ డైలాగ్‌ను తమకు అనువదించి జనసైనికులు, టీడీపీ దొంగలు ట్రోల్ చేశారని అన్నారు. ఆ డైలాగ్ వారికే వర్తిస్తుందని ఇటీవల తాను చెప్పడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్‌లో దొంగలుగా దాక్కుంటూ.. ఏపీలో ఇళ్లు లేకపోయినా అప్పుడప్పుడు వచ్చి మొరిగేసి వెళ్తున్నారని మండిపడ్డారు. లోకేష్ పాదయాత్రలో ఇష్టమొచ్చిన ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు చేశారు. ప్రతి ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేస్తూన్నాడన్నారు. చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీని తీసుకొని పవన్ కళ్యాణ్ ఊగిపోతూ.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ తో వైసీపీపై విమర్శలు చేస్తున్నారని రోజా విమర్శించారు.


చంద్రబాబుకు ఐటీ నోటీసులపై ఎవరూ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్‌లు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. చంద్రబాబు అమరావతి ఎందుకు కావాలంటున్నారనేది తాము స్పష్టంగా చెప్పామని అన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు, ఆయన టీమ్ ఎలా దోచుకున్నారనే ఈరోజు ప్రజలకు స్పష్టంగా అర్థమైందని అన్నారు. ఐటీని ఆయనే కనిపెట్టానని చెప్పుకుంటున్న పెద్ద మనిషి.. ఈరోజు ఐటీ ఇచ్చిన నోటీసుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు. 

అమరావతిలో అక్రమాలకు పాల్పడిన డబ్బులను బ్రహ్మిణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్‌లను విచారించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 


ఇదిలాఉంటే, విజయవాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు హాజరైన రజనీకాంత్.. టీడీపీ అధినేత చంద్రబాబు విజనరీపై ప్రశంసల వర్షం కురిపించారు. అయితే ఈ మాటల వైసీపీ నేతలకు, అభిమానులకు రుచించలేదు. దీంతో రజనీకాంత్‌పై విమర్శల దాడికి దిగారు. అందరి సంగతి పక్కన పెడితే.. సినీ రంగానికే చెందిన మంత్రి రోజా కూడా రజనీకాంత్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘రజనీకాంత్‌ను మనం పెద్ద స్థాయిలో ఊహించుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు ఆయన జీరో అయిపోయారు’’ అని విమర్శించారు. 

ఇన్నాళ్లూ సంపాదించిన పేరు పోగొట్టుకున్నాడని.. రాజకీయాలు వద్దనుకున్న రజనీకాంత్ మళ్లీ రాజకీయాలు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. మరో రాష్ట్రానికి వెళ్లే కళాకారులు అక్కడి రాజకీయాల గురించి వ్యాఖ్యానించే ముందు అక్కడి పరిస్థితులు తెలుసుకోవాలని అంటూ సూచనలు కూడా చేశారు.