గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో మంత్రి రోజా తన పదునైన విమర్శలతో కార్యకర్తల్లో జోష్ నింపారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసి కాదని... విడి విడిగా జగన్‌ను ఎదుర్కోవాలని రోజా సవాల్ విసిరారు. 

2019 ఎన్నికల్లో జగన్ ను సీఎం కానివ్వనన్న పవన్‌ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వలేదంటూ మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు. గుంటూరులో జరుగుతోన్న వైసీపీ ప్లీనరీలో ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ కటౌట్ ని చూస్తే ప్రతిపక్షానికి ఫ్యూజులు ఎగిరిపోతాయన్నారు. పవన్ కల్యాణ్ రీల్ స్టార్ అయితే జగన్ రియల్ స్టార్ అంటూ రోజా వ్యాఖ్యానించారు. జగన్, పవన్ లు కలిసి కాకుండా విడివిడి పోటీ చేయగలరా అని మంత్రి సవాల్ విసిరారు. ఒకరికి 175 స్థానాల్లో అభ్యర్ధులు లేరని.. టీడీపీకి 60 స్థానాల్లో అభ్యర్ధులు లేరని స్వయంగా లోకేషే ఒప్పుకున్నారని రోజా గుర్తుచేశారు. టీడీపీలో ఆడాళ్లు తోడలు కొడతారని.. మగాళ్లు మాత్రం ఏడుస్తారంటూ ఆమె సెటైర్లు వేశారు. అదొక జంబలకిడి పంబ పార్టీ అంటూ మంత్రి అన్నారు. వైసీపీ ప్లీనరీలో వైసీపీ కార్యకర్తలు తొడ గొడితే చంద్రబాబుకు హార్ట్ ఎటాక్ వస్తుందన్నారు. జగన్‌ని ఢీకొట్టడానికి గుంపులు గుంపులుగా కాదని.. సింగిల్‌గా రావాలని రోజా సవాల్ విసిరారు. 

సోనియా గాంధీనే గడగడలాడించిన పార్టీ వైసీపీ అన్నారు మంత్రి . వెన్నుపోటు వీరుడు చంద్రబాబు వెన్నులో వణుకు పుట్టించిన పార్టీ అని ఎద్దేవా చేశారు. వైసీపీ జెండాలో పోరాటం వుందని, పౌరుషం వుందని రోజా అన్నారు. వైసీపీ జెండా ఎప్పుడూ తలెత్తుకుని ఎగురుతూనే వుంటుందని.. ప్రజల గుండెల్లో గుడికట్టుకున్న నాయకుడు వైఎస్ అని ఆమె పేర్కొన్నారు. రాజ్యాధికారానికి మానవత్వం అద్దిన నాయకుడు వైఎస్ అని రోజా ప్రశంసించారు. 

ALso REad:అమ్మ రాజీనామా... వైసీపీ గౌరవాధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా

ఆశయం కోసం పోరాడే పులి జగన్ అని ఆమె అన్నారు. ప్రతి ఆడబిడ్డ కన్నీటిని జగన్ తుడుస్తున్నారని.. అనేక సంక్షేమ కార్యక్రమాలను ఆయన అమలు చేస్తున్నారని రోజా తెలిపారు. వెన్ను చూపకుండా పోరాడే దమ్మున్న నాయకుడు జగన్ అన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి క్షణం నుంచి ఈ రాష్ట్రంలోని మహిళల సంక్షేమం , సాధికారత కోసం పనిచేస్తున్నారని ఆమె కొనియాడారు. సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో సమస్యలను ఆయన కళ్లారా చూశారని రోజా తెలిపారు. తనకు ఓటు వేయకున్నా పేద వాడి కష్టం తీర్చాలని జగన్ నిర్ణయించుకున్నారని ఆమె పేర్కొన్నారు. 

తెలంగాణ జరిగిన సంఘటనకు చలించిన జగన్ .. ఏపీలో దిశా చట్టాన్ని తెచ్చారని రోజా తెలిపారు. ఆడపిల్లలపై అఘాయిత్యాలను అరికట్టేందుకు దిశా యాప్ ను కూడా వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి గుర్తుచేశారు. వారం రోజుల్లోనే ఫోరెన్సిక్ నివేదికలు వచ్చేలాగా ఏర్పాట్లు చేశామన్నారు. పోక్సో కేసులను త్వరితగతిన విచారించేందుకు గాను 12 పోక్సో కోర్టులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామని రోజా తెలిపారు. ఏపీలో జగనన్నను మించిన ధైర్యం లేదని... జగన్ పాలనలో మహిళల రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె చెప్పారు. మహిళా సాధికారతకు మూడేళ్ల జగన్ పాలనే నిదర్శనమని.. ఆడబిడ్డల కష్టాలు దూరం చేసేలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రోజా ప్రశంసించారు.