జబర్దస్త్ కార్యక్రమానికి వీడ్కోలు పలకడంపై మరోసారి స్పందించారు ఏపీ మంత్రి రోజా. పది మందికి ఉపయోగం కోసం.. ఒకటి వదులుకోక తప్పదని ఆమె స్పష్టం చేశారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తానని రోజా పేర్కొన్నారు.
కడప జిల్లా (kadapa district) ఇడుపులపాయలో శుక్రవారం ఏపీ పర్యాటక శాఖ మంత్రి (ap tourism minister) రోజా (rk roja) పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇకపై జబర్దస్త్ (jabardasth) చేయరా అని ఎంతోమంది తనను అడిగారని రోజా అన్నారు. పది మందికి ఉపయోగం కోసం.. ఒకటి వదులుకోక తప్పదని ఆమె స్పష్టం చేశారు. ఇకపై రాజకీయాల్లో నవ్వులు పూయిస్తానని రోజా వెల్లడించారు. నేను పుట్టిన ఊరు కడప అని ఆమె తెలిపారు. టీడీపీలో (tdp) ఉన్నప్పుడే వైఎస్సార్ (ys rajasekhara reddy) తనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని.. ఆయనతో కలిసి రాజకీయాల్లో పని చేయాలని కలగన్నానని రోజా వెల్లడించారు.
వైఎస్ అకాలమరణంతో ఆ అవకాశం రాకపోవడంతో చాలా బాధపడ్డానన్నారు. ఆ టైంలో ఐరన్ లెగ్ అంటూ తనను టీడీపీ వాళ్లు అవహేళన చేశారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కావాలన్నది తన కల అని, ఏకంగా రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యానని ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం జగన్ ఆశీర్వాదరంతో మంత్రిని కూడా అయ్యానని చెప్పారు. పార్టీ విజయం కోసం అహర్నిశలు పని చేస్తానని రోజా పేర్కొన్నారు. ఆర్థిక పురోగతి సాధించే విధంగా ఏపీలో పథకాలు అమలు అవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవడానికి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలే కారణమని రోజా అభిప్రాయపడ్డారు.
ఫైర్ బ్రాండ్ గా రోజా గురించి తెలుగునాట పరిచయం అక్కర్లేదు. నటిగా మొదలైన ఆమె ప్రస్థానం ఆ తరువాత 1999లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. మొదటి టీడీపీలో పనిచేసిన ఆమె అనంతరం వైఎస్సార్ సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ పార్టీ (ysrcp) తరఫున నగరి అసెంబ్లీ నియోజవర్గం నుంచి 2014లో ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. తరువాత 2019లో కూడా అదే నియోజకవర్గంనుంచి విజయం సాధించారు. మొదటిసారి టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడిని, రెండోసారి ఆయన కుమారుడు గాలి భానుప్రకాశ్ ను చిత్తుగా ఓడించారు.
2014 ఎన్నికల కంటే ముందే వైసీపీలో చేరిన ఆమె మొదటి నుంచి జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. అసెంబ్లీలో వైసీపీ వాయిస్ ను వినిపించడంలో కీలకంగా పని చేశారు. దీంతో ఆమె సీఎం జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితురాలిగా మారారు. చివరికి రోజా నిరీక్షణ ఫలించి మంత్రి పదవి దక్కడంతో కుటుంబంతో సంతోషంగా ఆ ఆనందాన్ని పంచుకున్నారు. భర్త, పిల్లలతో స్వీట్లు తినిపిస్తూ సంతోషాతరేకాలు వ్యక్తం చేసింది. ప్రమాణ స్వీకారోత్సవంలో వైఎస్ జగన్ తో సెల్ఫీ కూడా దిగారు రోజా.
