జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి రోజా. ఆయన రీల్ లైఫ్‌లో సీఎం, పీఎం, గవర్నర్ కావొచ్చని.. కానీ రియల్ లైఫ్‌లో పవన్‌కు అంత సీన్ లేదంటూ రోజా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. దీనిపై జనసేన నేతలు మండిపడుతున్నారు.  

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం (ysrcp govt) ఇవాళ మ‌రో కొత్త ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్ యంత్ర సేవా పేరిట (ysr yantra seva) మంగ‌ళ‌వారం సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (ys jagan mohan reddy) ఈ ప‌థ‌కానికి గుంటూరు జిల్లాలో శ్రీకారం చుట్ట‌ారు. ఈ సందర్భంగా మంత్రి రోజా (rk roja) త‌న సొంత నియోజ‌కవ‌ర్గం న‌గ‌రిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాదు.. రోజా స్వ‌యంగా ట్రాక్ట‌ర్ న‌డిపారు. ఈ సంద‌ర్భంగా మీడియా ప్ర‌తినిధుల‌తో ఆమె మాట్లాడుతూ... టీడీపీ (tdp) అధినేత చంద్ర‌బాబు నాయుడు (chandrababu naidu), జ‌న‌సేన చీప్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌లపై (pawan kalyan) మండిపడ్డారు. టీడీపీ, జ‌న‌సేన‌తో పాటు ఎన్ని పార్టీలు గుంపులు గుంపులుగా వ‌చ్చినా జ‌గ‌న్ అనే సింహం సింగిల్‌గానే వ‌స్తుంద‌ని స్పష్టం చేశారు. 

ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచన ఉందా? లేదంటే ప‌ద‌వులే ప‌ర‌మావ‌ధిగా పెట్టుకున్నారా? అన్న విష‌యంపై ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు చంద్రబాబు కూడా క్లారిటీ ఇవ్వాలని రోజా డిమాండ్ చేశారు. చంద్ర‌బాబు ఎప్పుడూ ఒంట‌రిగా పోరాటం చేసే నేత కాద‌ని, నిత్యం ఆయ‌న పొత్తుల‌తోనే ముందుకు సాగుతున్నార‌ని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ రీల్ హీరో మాత్రమేనని, ఆయన రియల్ హీరో కాదంటూ రోజా సెటైర్లు వేశారు. రెండున్నర గంటల సినిమాల్లో పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ కూడా కావచ్చని... కానీ నిజ జీవితంలో ఆయనకు సీఎం అయ్యే సీన్ లేదని రోజా ఎద్దేవా చేశారు. 

Also Read:పవన్ పోరాటం ప్రజల కోసం కాదు.. ఆయనకు ఆప్షన్లు లేవు: మంత్రి ఆర్కే రోజా

అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు స్పష్టంగా చెబితే ఎవరైనా సీఎం కావొచ్చు అంటూ ఆమె హితవు పలికారు. వైసీపీని ఎదుర్కోలేక చంద్రబాబు తంటాలు పడుతున్నాడని, ప్రజలంతా జగన్ వెంట ఉండటం చూసి కుట్రలు పన్నుతున్నారని రోజా ఆరోపించారు. పొత్తులు పెట్టుకున్నంత మాత్రాన వైసీపీని ఎవరు ఏం చేయలేరని, సింగల్ గానే సీఎం జగన్ ఆధ్వర్యంలో ప్రజల్లోకి వెళ్తామని, వచ్చే ఎన్నికల్లో 160 స్థానాలు మావేనని మంత్రి రోజా జోస్యం చెప్పారు.