జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అని విమర్శించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం అని విమర్శించారు. సోమవారం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు ఆప్షన్లు లేవని.. ఓడిపోవడమేనని విమర్శించారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారని ఎద్దేవా చేశారు. 2024లో కూడా అదే రిపీట్‌ అవుతుందన్నారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్దాంతమని విమర్శించారు. 

టీడీపీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. టీడీపీకి 50 స్థానాల్లో అభ్యర్థులు లేరని లోకేష్ చెప్పారని అన్నారు. బద్వేలుకి మించిన మెజారిటీ ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పోటీ నామా మాత్రమేనని అన్నారు. బద్వేలులో బిజేపీకి వెనుక నుంచి మద్దతు ఇచ్చిన టీడీపీ, జనసేన ప్రయత్నాలు ఫలించలేదని మంత్రి రోజా ఆరోపించారు. ఏపీలో బీజేపీని ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎద్దేవా చేశారు. మూడేళ్లలో గౌతమ్ రెడ్డి మంచితనానికి.. సీఎం జగన్ మానవత్వానికి ఆత్మకూరు ప్రజలు ఓటు వేసే సమయం అని అన్నారు. మేకపాటి కుటుంబంపై ప్రజలకు అభిమానం చాటిచెప్పే తరుణం వచ్చిందన్నారు.

ఇక, ఇటీవల పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వన్‌సైడ్ లవ్ అనే కామెంట్లు చేసిన చంద్రబాబు .. ఇప్పుడు వార్ వన్‌సైడ్ అంటున్నారని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు క్లారిటీ వచ్చాక మిగిలిన విషయాలు మాట్లాడతామన్నారు. రాష్ట్రం కోసం తాను తగ్గడానికి సిద్ధమన్న పవన్.. అన్ని సార్లు తాను తగ్గానని, ఈసారి మిగిలిన వాళ్లు తగ్గితే బాగుంటుందన్నారు. ప్రస్తుతం జనసేన ముందు మూడు ప్రత్యామ్నాయాలు వున్నాయని పవన్ చెప్పారు. 

అప్షన్ 1: జనసేన, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అప్షన్ 2: జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, అప్షన్ 3: జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. ఈ మూడు ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని పవన్ పిలుపునిచ్చారు. మంచి కోసం తగ్గాలనేది బైబిల్ సూక్తి అని చెప్పిన పవన్ కల్యాణ్.. టీడీపీ ఆ బైబిల్ సూత్రాన్ని పాటిస్తే మంచిదని అన్నారు.