Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇలా గెలిచారు..టీడీపీ అధికారంలోకి రావటం పగటి కలే : మంత్రి రోజా వ్యాఖ్యలు

శవాల నోట్లో తులసి తీర్ధం పోసినట్లుగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీ స్థానాలు దక్కాయన్నారు మంత్రి ఆర్‌కే రోజా. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారంలోకి రావటమన్నది పగటి కలేనన్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేశారని ఆమె మండిపడ్డారు .
 

minister rk roja fires on tdp leaders
Author
First Published Mar 21, 2023, 4:38 PM IST

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అధికారంలోకి రావటమన్నది పగటి కలేనన్నారు మంత్రి ఆర్కే రోజా. మంగళవారం తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగనన్న వన్స్‌మోర్ అని ప్రజలు అంటున్నారని రోజా వ్యాఖ్యానించారు. శవాల నోట్లో తులసి తీర్ధం పోసినట్లుగా టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీ స్థానాలు దక్కాయని మంత్రి సెటైర్లు వేశారు. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్‌తో గెలవలేదన్నారు. అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరమని.. బీసీ అయిన సభాపతిని అవమానించి దాడి చేయడం సరికాదన్నారు. 

చేసిన తప్పును సమర్ధించుకోవడానికి తమ నాయకులపై నిందలు వేయడం సిగ్గు చేటని.. టీడీపీ హయాంలో వారి వర్గీయులకే పదవులు ఇచ్చారని ఆమె దుయ్యబట్టారు. ప్రతిపక్షంలో మాత్రం దళితులను ముందు పెడుతున్నారని రోజా ఫైర్ అయ్యారు. జీవో నెంబర్ 1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చిందా అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేశారని.. ఈ కారణంగానే తాము జీవో నెంబర్ 1 తీసుకొచ్చామని రోజా వెల్లడించారు. టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి హెచ్చరించారు. 

ALso Read: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను భారత్-కెన్యా మ్యాచ్‌తో పోల్చిన మంత్రి అమర్‌నాథ్.. ఆయన ఏమన్నారంటే..?

అంతకుముందు స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ టీడీపీ హయాంలోనే  జరిగిందని మంత్రి గుడివాడ అమర్‌నాథ్ విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ స్కిల్ డెవలప్మెంట్స్ స్థాపించి స్కామ్‌కు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. చంద్రబాబు  నాయుడు స్కామ్ నైపుణ్యతకు ఇది ఒక ఉదాహరణ అని విమర్శించారు. ఒక్క ప్రైవేట్ సంస్థ 90 శాతం నిధులు ఎందుకు కేటాయిస్తుందనే అనుమానం ఎవరికైనా వస్తుందని అన్నారు. యూరో లాటరీల మాదిరిగా టీడీపీ హయాంలో షెల్ కంపెనీలతో కలిసి సింగపూర్ కేంద్రంగా స్కామ్ జరిగిందని చెప్పారు. 

సీమెన్స్ సంస్థకు లేఖ రాస్తే అంత తక్కువ పెట్టుబడికి.. అంత ఎక్కువ ఎలా పెడతామని సమాధానమిచ్చారని తెలిపారు. టీడీపీ హయాంలో డిజైన్ టెక్ కంపెనీకి రూ. 185 కోట్ల సింగిల్ ట్రాన్స్‌ఫర్ జరిగిందని చెప్పారు. అక్కడి నుంచి షెల్ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్నారు. సింగపూర్‌కు వెళ్లిన డబ్బులు టోకెన్ల రూపంలో హైదరాబాద్‌కు రావడం ఏమిటని ప్రశ్నించారు.అప్పటి సీఎం చంద్రబాబు ఆదేశాలతో నిధులు మంజూరు చేస్తున్నట్టుగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్వయంగా జీవో విడుదల చేశారు. 

అప్పటి ఏలేరు స్కామ్‌లో చంద్రబాబు పాత్ర అందరికీ తెలుసునని మంత్రి అన్నారు. స్టాంప్‌ల కుంభకోణంలో చంద్రబాబు హస్తం బయటపడిందని చెప్పుకొచ్చారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ దేశంలోనే అతి పెద్దదని.. ఇందులో చంద్రబాబు, లోకేష్‌ అరెస్ట్ కావాల్సి ఉందని అన్నారు. దర్యాప్తు సంస్థలు లోతుగా విచారణ చేస్తే మరిన్ని విషయాలు  బయటపడతాయని చెప్పారు. చంద్రబాబుకు అవినీతిలో నోబుల్, మోసం చేయడంలో ఆస్కార్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios