Asianet News TeluguAsianet News Telugu

జగన్‌ను అథ:పాతాళానికి తొక్కేస్తానన్న పవన్ కళ్యాణ్ .. రోజా స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఆర్కే రోజా. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు జగనన్నను అథ:పాతాళానికి తొక్కుతావా అంటూ రోజా మండిపడ్డారు.

minister rk roja counter to janasena president pawan kalyan over his comments on ap cm ys jagan ksp
Author
First Published Feb 29, 2024, 3:56 PM IST | Last Updated Feb 29, 2024, 3:57 PM IST

వైసీపీ, ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు మంత్రి ఆర్కే రోజా. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఏమీ ఆషామాషీగా సీఎం కాలేదన్నారు. ప్రజల ఆశీస్సులతో ఆయన తిరుగులేని ముఖ్యమంత్రిగా అయ్యారని.. మరి నువ్వు రెండు చోట్ల నిలబడితే రెండు చోట్లా గెలవలేకపోయావంటే అర్ధం చేసుకోవాలని రోజా చురకలంటించారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా వుండి 24 సీట్లకే పరిమితమైపోయి మళ్లీ క్యాడర్‌ను తిడుతున్నాడంటూ మంత్రి ఎద్దేవా చేశారు. బూత్ కమిటీలు, మండల కమిటీలను పార్టీ అధ్యక్షుడు ఏర్పాటు చేయాలని రోజా ధ్వజమెత్తారు. 

పార్టీ అధ్యక్షుడవన్న పేరు తప్పించి ఏనాడైనా పార్టీ నిర్మాణం సంగతి పట్టించుకున్నావా అని ఆమె ప్రశ్నించారు. నీ తప్పును కార్యకర్తల మీద జనసైనికుల మీద రుద్దడం సిగ్గుచేటని.. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వు జగనన్నను అథ:పాతాళానికి తొక్కుతావా అంటూ రోజా మండిపడ్డారు. చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తూ నువ్వే అథ:పాతాళానికి వెళ్లావని మంత్రి విమర్శించారు. 

అంతకుముందు నిన్న తాడేపల్లిగూడెంలో జనసేన టీడీపీలు నిర్వహించిన ‘జెండా’ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. బలి చక్రవర్తి కూడా వామనుడిని చూసి ఇంతేనా అన్నారని.. నెత్తిన కాలుపెట్టి తొక్కితే ఎంతో అని తెలిసిందని పవన్ చురకలంటించారు. జగన్‌ను అథ:పాతాళానికి తొక్కకపోతే తన పేరు పవన్ కళ్యాణ్ కాదంటూ జనసేనాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలేనని..  ఒక్కో ఇటుక పేర్చి ఇల్లు కడుతున్నానని, కోట కూడా కడతామని, రేపు తాడేపల్లి కోట కూడా బద్ధలు కొడతామన్నారు. 

తనకు సలహాలు ఇచ్చేవాళ్లు అక్కర్లేదని.. యుద్ధం చేసేవాళ్లు కావాలని పవన్ వ్యాఖ్యానించారు. మాటిమాటికీ జగన్ తన పెళ్లిళ్ల గురించి మాట్లాడుతున్నారని, కానీ తామెప్పుడూ ఆయన సతీమణి గురించి మాట్లాడలేదని పవన్ తెలిపారు. జగన్ దృష్టిలో పవన్ కళ్యాణ్ అంటే మూడు పెళ్లిళ్లు, రెండు విడాకులు.. మాట్లాడితే నాలుగు పెళ్లిళ్లు అంటాడని.. ఆ నాలుగో పెళ్లాం ఎవరో తనకు తెలియదన్నారు. లేని నాలుగో పెళ్లాం అంటే నువ్వే.. రా జగన్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.     

ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు రెడ్ల కోసం 5 కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. రాష్ట్రంలో ఏ ఇష్యూ అయినా ఈ ఐదుగురే పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. మిగిలిన ఏ నాయకులకు ఎలాంటి అధికారం , హక్కు లేవన్నారు. తాను ఒక్కడినే అంటున్న జగన్.. మా ఒక్క ఎమ్మెల్యేను లాక్కున్నారని , జూబ్లీహిల్స్ ఫాంహౌస్‌లో ఇల్లు కట్టినప్పటి నుంచి జగన్ బతుకేంటో తనకు తెలుసునని పవన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని.. తన నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని ఆయన అన్నారు. 

జగన్ ఇప్పటి వరకు పవన్ తాలుకా శాంతినే చూశారని.. ఇకపై తన యుద్ధం ఏంటో చూస్తావంటూ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్‌తో స్నేహమంటే చచ్చేదాకా.. పవన్ కళ్యాణ్‌తో శత్రుత్వమంటే అవతలివాడు చచ్చేదాకా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ యువ ముఖ్యమంత్రి అంట.. యువతను బొంద పెట్టడానికి తప్ప ఈ యువ ముఖ్యమంత్రి ఎందుకూ పనికిరాలేదని చురకలంటించారు. 2019లోనే జగన్‌కు ఓటేయొద్దని చెప్పానని.. అయినా ప్రజలు వినలేదని పవన్ ఎద్దేవా చేశారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios