టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి పేర్నినాని. బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం జగన్ సంక్షేమ పాలన చూసి చంద్రబాబు, లోకేశ్‌ ఓర్చుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేయలేని అనేక గొప్ప పనుల్ని జగన్ చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు.

ఈ నెల 30తో జగన్ పాలనకు రెండేళ్లు పూర్తవుతాయని పేర్ని నాని గుర్తుచేశారు. జగన్  పాలనపై ప్రజల్లో చర్చ జరుగుతోందని.. మేనిఫెస్టోలను చంద్రబాబు ఓట్ల కోసమే వాడుకున్నారని మంత్రి ధ్వజమెత్తారు. మేనిఫెస్టోను జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావిస్తారని పేర్నినాని తెలిపారు.

Also Read:ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడిపై జగన్ సీరియస్: చర్యలకు ఆదేశం, అధికారులకు 24 గంటల డెడ్‌లైన్

ఇచ్చిన హామీల్లో 94.5శాతం రెండేళ్లలోనే నెరవేర్చారని మంత్రి గుర్తుచేశారు. 40 ఏళ్ల అనుభవం ఒకవైపు, 40 ఏళ్ల వయసు ఒకవైపు వుందని పేర్నినాని వ్యాఖ్యానించారు. విద్య, వైద్య రంగాల్లో పెను మార్పులు తెస్తున్నామని... ఒకేసారి 14 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని పేర్ని నాని తెలిపారు.

భవిష్యత్తు సవాళ్లకు ధీటుగా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొస్తున్నామన్నారు. ఉన్నత చదువుల ద్వారానే పేదరికం పోతుందని... అందుకే విద్యకు జగన్ అంత ప్రాధాన్యతనిస్తున్నారని పేర్నినాని వెల్లడించారు. అందరినీ చదివించాలనే ఉద్దేశ్యంతోనే అమ్మఒడి పథకం తీసుకొచ్చామని... పేదలందరికీ నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.