బ్లాక్ ఫంగస్ మందులపై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా బ్లాక్ ఫంగస్‌కు వాడే ఇంజెక్షన్లకు కొరత వుందని ఆయన స్పష్టం చేశారు. ఒక్కో రోగికి వారానికి కనీసం 50 ఇంజెక్షన్లు ఇవ్వాల్సి వుంటుందని సీఎం అన్నారు.

కేంద్రం నుంచి మనకు కేవలం 3 వేల ఇంజెక్షన్లే వచ్చాయని.. మరో 2 వేల ఇంజెక్షన్లు వస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. వీలైనన్ని ఇంజెక్షన్లను తెప్పించడానికి కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని.. ఏపీలో కోవిడ్ కట్టడికి కర్ఫ్యూని విధించామని తెలిపారు.

ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వెసులుబాటు ఇచ్చామని జగన్ అన్నారు. కర్ఫ్యూ సమయంలో 144 సెక్షన్ కూడా అమలులో వుందని గుర్తుచేశారు. కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారమని జగన్ తెలిపారు.

Also Read:ఆనందయ్య మందుపై అధ్యయనంలో అవాంతరాలు: ఆ తర్వాతే క్లినికల్ ట్రయల్స్

అలాగే ప్రైవేట్ ఆసుపత్రుల దందాపైనా సీఎం జగన్ సీరియస్ అయ్యారు. అవకతవకలకు పాల్పడే ప్రైవేట్ ఆసుపత్రులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే నేరుగా తనకే నివేదిక అందించాలని సీఎం సూచించారు.

నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులపై కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు. మొదటిసారి తప్పు చేస్తే జరిమానా విధించాలని.. మళ్లీ మళ్లీ తప్పు చేస్తే కేసులు పెట్టాలని సీఎం అన్నారు. తరచూ అవకతవకలకు పాల్పడే ఆసుపత్రులపై క్రిమినల్ కేసులు పెట్టాలని జగన్ ఆదేశించారు.