Asianet News TeluguAsianet News Telugu

పాపం పండే రోజు వస్తే దాక్కోలేరు: చంద్రబాబుపై నాని వ్యాఖ్యలు

పాపం పండే రోజు వస్తే ఎవరు దాక్కొలేరంటూ టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా విమర్శలు చేశారు మంత్రి పేర్ని నాని. 

minister perni nani sensational comments on tdp chief chandrababu naidu over insider trading in amaravathi
Author
Amaravathi, First Published Dec 27, 2019, 2:53 PM IST

పాపం పండే రోజు వస్తే ఎవరు దాక్కొలేరంటూ టీడీపీ అధినేత, చంద్రబాబు నాయుడుపై పరోక్షంగా విమర్శలు చేశారు మంత్రి పేర్ని నాని. శుక్రవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ జరిగింది. అనంతరం ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి మీడియాకు వివరించారు.

రాజధానిపై హైలెవల్ కమిటీ ఏర్పాటు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. జీఎన్ రావు కమిటీ అందజేసిన నివేదికతో పాటు బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ ఇచ్చే మరో నివేదికను  పరిశీలించేందుకు కమిటీని ఏర్పరుస్తామని నాని పేర్కొన్నారు.

Also Read:AP cabinet : వేల కోట్లు ఖర్చుపెట్టినా అమరావతిని అభివృద్ధి చేయలేం...

చంద్రబాబు ప్రభుత్వం పనివాళ్లు, డ్రైవర్ల పేరుతో భూములు కొనుగోలు చేసిందని ఎద్దేవా చేశారు. రాజధాని ప్రకటనకు ముందు అమరావతి ప్రాంతంలో జరిగిన భూములు కొనుగోళ్లకు సంబంధించి విచారణ జరిపిస్తామన్నారు.

ఊహాజనిత, కలల రాజధానిని బాబు కట్టాలనుకున్నారని, ఇందుకు గాను లక్షా 10 వేల కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారని మంత్రి తెలిపారు. అంత అంచనా వేసి ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసింది కేవలం రూ. 5,400 కోట్లు మాత్రమేనని, మిగిలిన రూ.1.06 లక్షల కోట్లు ఖర్చు చేయాలంటే ఎన్నేళ్లు పడుతుందని ఆయన సెటైర్లు వేశారు.

రాజధాని ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై విచారణ జరిపిస్తామని, న్యాయ నిపుణుల సలహా మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామని మంత్రి వెల్లడించారు. లోకాయుక్త లేదా సీబీఐతో రాజధాని ప్రాంతంలోని అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు.

Also Read:చంద్రబాబుకు షాక్: సీబీఐకి అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్?

అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలా లేక ఒక్క రాజధానినే నిర్మించాలా అని నాని ప్రశ్నించారు. మూడు రాజధానులపై ముఖ్యమంత్రి ఎటువంటి ప్రకటనా చేయలేదని, కేవలం ఉండొచ్చు అని మాత్రమే చెప్పారని నాని గుర్తుచేశారు.

చంద్రబాబు ప్రభుత్వం రాజధాని కోసం తీసుకొచ్చిన రూ.5 వేల కోట్ల అప్పుకే ప్రభుత్వం రూ.500 కోట్ల వడ్డీ కడుతున్నామని, అదే లక్ష కోట్లు అప్పులు తీసుకోస్తే వడ్డీ ఎంత ఉంటుందో ఊహించాలన్నారు. సీఆర్‌డీఏ పరిధిలో జరిగిన అవినీతిపై కేబినెట్ సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని నాని గుర్తుచేశారు. 

గత ప్రభుత్వం శివరామకృష్ణన్ కమిటీ నివేదికను పక్కనబెట్టిందని.. అదే సమయంలో నారాయణ కమిటీ నివేదికను ఆమోదించిందని నాని వ్యాఖ్యానించారు. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ ముందు జీఎన్ రావు కమిటీని స్వాగతించి ఇప్పుడు మౌనవ్రతం ఎందుకు చేస్తున్నారో అర్ధం కావడం లేదని నాని వ్యాఖ్యానించారు.

యూటర్న్ అనేదానిపై చంద్రబాబు నాయుడుకు పేటేంట్ రైట్ ఉందంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు. సిటిజన్‌షిప్ బిల్లుకు వైసీపీతో పోటీ పడిమరి టీడీపీ అనుకూలంగా ఓటు వేసిందని, మరి చంద్రబాబుకు మోడీతో ఎలాంటి అవసరాలు ఉన్నాయోనంటూ ఎద్దేవా చేశారు.

Also Read:బొత్స ఇల్లు ముట్టడి, ప్రకాశం బ్యారేజీపై రాకపోకల నిలిపివేత: కొనసాగుతున్న ఉద్రిక్తత

రామజన్మభూమి, బాబ్రీ మసీదు వంటి పెద్ద పెద్ద సమస్యలపై తీర్పు వచ్చినప్పుడు భారతదేశ ప్రజలు సంయమనంతో ఉన్నారని.. కానీ పౌరసత్వ సవరణ బిల్లుపై ఎందుకు భగ్గుమంటున్నారో కేంద్రప్రభుత్వం తెలుసుకోవాలని నాని సూచించారు.

2050 నాటికి 50 లక్షల జనాభా వస్తారని చంద్రబాబు చెప్పారని.. మరి రూ.5000 కోట్లకు ఎంతమంది వచ్చి అమరావతి వచ్చారని నాని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అమరావతిలోనే ఇల్లు, పార్టీ కార్యాలయం నిర్మించారని, కానీ చంద్రబాబు నాయుడు ఇంతవరకు అలాంటి ప్రయత్నం చేయలేదని మంత్రి విమర్శించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios