తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి పేర్ని నాని. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన యస్ బ్యాంక్ ఛైర్మన్ రాణా కపూర్‌కు చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని నాని ఆరోపించారు.

Also Read:కొచ్చర్.. రాణాకపూర్ టూ ఉర్జిత్ వరకు ఎగ్జిట్‌లే

తాను దోచుకున్న డబ్బును దాచుకునేందుకు, ఆ డబ్బును దేశం దాటించేందుకు యస్ బ్యాంకుతో బాబు చేతులు కలిపారని ఆయన ధ్వజమెత్తారు. యస్ బ్యాంక్‌ను చంద్రబాబు హవాలా అవసరాలకు వినియోగించుకున్నారని.. రాణా కపూర్‌తో టీడీపీ అధినేతకు ఉన్న లింకులపై కేంద్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ సొమ్మును యస్ బ్యాంకులో ఎందుకు డిపాజిట్ చేయించారని నాని ప్రశ్నించారు. యస్ బ్యాంక్ ముడుపుల లావాదేవీల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని పేర్ని నాని కేంద్రాన్ని కోరారు.

Also Read:యస్ బ్యాంక్ : రానా కపూర్ పై మనీ లాండరింగ్ కేసు...

తన మాజీ పీఏ అక్రమ లావాదేవీలపై చంద్రబాబు నాయుడు ఇంతవరకు నోరు ఎందుకు విప్పలేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లకు కూడా చంద్రబాబు మోకాలడ్డారని, అధికారంలో ఉన్నప్పుడు కూడా వెనుకబడిన వర్గాలకు ఆయన చేసేందేమీ లేదని నాని వ్యాఖ్యానించారు.