బ్యాంకింగ్‌ రంగంలో 2018కి విశిష్ట స్థానం ఉంది. బ్యాంకులన్నీ మొండి బకాయి పద్దుల్ని పుస్తకాల్లోంచి తొలగించాయి. కొందరు బడా బాబులు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయారు. మోసాలు చేయగల సామర్థ్యం గల నీరవ్ మోదీ అతని మేనమామ మెహుల్ చోక్సీ వంటి వరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)ని ముంచేసి ఏం చక్కా పారిపోయారు. చివరికి అవినీతి ఆరోపణలు, అననుకూల వాతావరణం, ఆర్బీఐ ఆంక్షల కొరడా ఫలితంగా ప్రవేట్ బ్యాంకుల అధినేతలు ఆయా సంస్థలను వీడారు. కేంద్రం ఒత్తిడిని నిరాకరిస్తూ.. స్వయంప్రతిపత్తిని ధ్వంసం చేయలేక ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ వీడ్కోలుతో ఈ కథ ముగిసింది. ఇక బ్యాంకింగ్ రంగంలో అవినీతి కేసులు, వాటిపై సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే.

ప్రారంభంలోనే పీఎన్బీని ముంచెత్తిన నీరవ్ మోదీ- చౌక్సీ స్కామ్
ఈ ఏడాది ఆరంభంలోనే బ్యాంకింగ్‌ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం వెలుగుచూసింది. వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ, అతడి మేనమామ మెహుల్‌ ఛోక్సీ బండారం బయటపడింది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకును అండర్ టేకింగ్‌ల పేరిట రూ.14,000 కోట్ల మేర మోసం చేసిన విధానం చూసి ప్రజల మతిపోయింది. 2011 మార్చి నుంచి ముంబైలోని ఓ శాఖ నీరవ్ మోదీ సంస్థలకు ఎల్‌ఓయూలు అందించింది. ఇందుకు ఓ ఉద్యోగి సహాయపడ్డాడు. దీంతో బ్యాంకింగ్‌ వ్యవస్థలోని లుకలుకలు బయటపడ్డాయి. ఈ కుంభకోణంపై దర్యాప్తు సంస్థలు ద్రుష్టి సారించే లోపే నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీ విదేశాలకు చెక్కేశారు. ప్రస్తుతం వారిద్దరినీ స్వదేశానికి రప్పించే విషయమై దర్యాప్తు జరుగుతోంది.

ఇలా చందాకొచ్చర్ నిష్క్రమణ
వివాదాలకు అల్లంత దూరాన ఉండే ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్‌కు కూడా ఈ ఏడాది అవినీతి మరకలు అంటాయి. అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకు సీఈఓ కం మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమెకెంతో పేరుంది. వీడియోకాన్‌ ఇండస్ట్రీస్‌కు క్విడ్ క్రో ప్రోలో భాగంగా రుణాలిచ్చినట్టు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు ఆమెకు అండగా నిలిచినా ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో బయటకు వెళ్లక తప్పలేదు. 

ఇలా ఐసీఐసీఐ బ్యాంకులో ట్రైనీగా చందాకొచ్చర్ కెరీర్ ప్రారంభం
1984లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా ప్రవేశించిన చందా కొచ్చర్‌ అక్టోబర్‌లో ఇబ్బందికరంగా నిష్ర్కమించారు. ఇక యాక్సిస్‌ బ్యాంకు ఎండీగా మరికొంత కాలం కొనసాగేందుకు శిఖా శర్మకు ఆర్బీఐ అనుమతి ఇవ్వలేదు. బ్యాంకు బోర్డు 2021 వరకు ఆమెను కొనసాగేందుకు ప్రతిపాదించింది. ఆర్బీఐ ససేమిరా అంది. మరోవైపు యస్‌ బ్యాంకు సీఈవో రాణా కపూర్‌కు కూడా ఆర్బీఐ నుంచి ఇదే అనుభవం ఎదురైంది. 

యస్ బ్యాంకులో ప్రమోటర్ల మధ్య విభేదాలిలా..
యస్ బ్యాంక్ విషయంలో ప్రమోటర్ల మధ్య విభేదాలు ఒక కారణం. 2008 ముంబై దాడుల్లో మరణించిన మధుకపూర్ భర్త అశోక్ కపూర్.. ప్రస్తుత యస్ బ్యాంక్ సీఈఓ రాణా కపూర్ కలిసి యస్ బ్యాంక్ స్థాపించారు. కానీ అశోక్ కపూర్ మరణం తర్వాత ఆయన భార్యకు ప్రమోటర్ గా చోటు కల్పించకుండా దాటవేసేందుకు రాణా కపూర్ చేసిన ప్రయత్నం వికటించింది. మధుకపూర్ జరిపిన న్యాయపోరాటంలో ఆమెనే విజయం వరించింది. ఈ నేపథ్యంలో బ్యాంక్ సీఈఓగా రాణా కపూర్ కొనసాగింపునకు ఆర్బీఐ ససేమిరా అన్నది. దీంతో 2019, జనవరి 31 తర్వాత కొత్తవారు రావాల్సిందే. గత నెల్లో బ్యాంకు ఛైర్మన్‌  అశోక్‌ చావ్లా పదవి నుంచి దిగిపోయారు.

ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా ఓ సంచలనం
ఇక ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నిష్ర్కమణ అత్యంత సంచలనంగానూ, వివాదాస్పదంగానూ మారింది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని అంశాల్లో ప్రభుత్వానికి, ఆర్బీఐకి సఖ్యత కుదరలేదు. ప్రత్యేకించి ఆర్బీఐ స్వయంప్రతిపత్తికి సంబంధించిన అంశాలపై ఇరు పక్షాల మధ్య విభేదాలు తలెత్తాయి. అవసరమైతే సెక్షన్ 8 ప్రయోగిస్తామని కేంద్రం బెదిరింపులకు దిగింది. ప్రభుత్వం మళ్లీ కొలువు దీరేందుకు ఆర్బీఐ వద్ద గల రిజర్వు నిధులను తమ సంక్షేమ పథకాలకు మళ్లించాలని ఎత్తు వేసింది. ఈ రిజర్వు నిధులను ఆపత్కాలంలో అడ్డుచక్రం వేసేందుకు అని వివరించినా కేంద్రం వెనుకడుగు వేయలేదు. దీంతో వ్యక్తిగత కారణాల పేరిట ఈనెల 10వ తేదీన పటేల్‌ రాజీనామా చేశారు. ప్రభుత్వం వెంటనే మాజీ ఆర్థిక కార్యదర్శి శక్తికాంత దాస్‌ను కొత్త గవర్నర్‌గా నియమించింది. స్థూల మొండి బాకీల విషయంలో ఇబ్బందుల కారణంగానే యాక్సిస్‌, యెస్‌ బ్యాంకు అధికారులు కొనసాగేందుకు ఆర్బీఐ అనుమతి ఇవ్వలేదు.

ప్రైవేట్ బ్యాంకులకు మొండి బకాయిల మోత
రెండేళ్లలోనే యాక్సిస్‌ బ్యాంకు మొండి బాకీలు ఐదు రెట్లు పెరిగాయి. అదే సమయంలో నికర లాభాలు తగ్గాయి. 2009లో 0.96 శాతంగా ఉన్న మొండి బకాయిల నిష్పత్తి 2017 మార్చికి 5.04 శాతానికి పెరిగింది. యస్‌ బ్యాంకు తమ ఎన్‌పీఏలను తప్పుగా చూపిస్తోంది. 2016-17కు ఇవి రూ.2,018 కోట్లు అని బ్యాంకు చెప్తుండగా ఆర్బీఐ మాత్రం రూ.8,373 కోట్లని తేల్చింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ వీటి బెడద ఎక్కువగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బ్యాంకుల మొండి బాకీలు రూ.23,860 కోట్లు తగ్గి రూ.8,71,741 కోట్లకు చేరుకున్నాయి. ఇక 2018, అక్టోబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నష్టాలు రూ.4,285 కోట్ల నుంచి రూ.4,532 కోట్లకు పెరిగాయి. అయితే ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో రూ.67,026 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామని ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. ఇక ముందూ ఇదే ధోరణి ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

ఊపందుకున్న బ్యాంకుల విలీన ప్రయత్నాలు
అప్పుల ఊబిలో చిక్కుకున్న ఐడీబీఐ బ్యాంకులోని వాటాను ఎల్‌ఐసీకి అమ్మేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఎస్బీఐలో దాని అనుబంధ బ్యాంకుల విలీనం తర్వాత తాజాగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, విజయ బ్యాంకు, దేనా బ్యాంకును విలీనం చేసి దేశంలోనే అతిపెద్ద మూడో బ్యాంకును రూపొందించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అలాగైతే ఆ బ్యాంకు మొత్తం విలువ రూ.14.8 లక్షల కోట్లు ఉంటుంది. విలీనం జరిగితే ఆర్థికంగా బలపడుతుంది. ప్రభుత్వ బ్యాంకుల సగటు మొండి బకాయిల నిష్పత్తి 12.1 శాతంతో పోలిస్తే దీనిది తక్కువగా 5.7 శాతం ఉంటుంది.