ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి కేబినెట్‌లో పలు ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత రాష్ట్రానికి సీఎం అయ్యారు జగన్. తద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘనతను సాధించిన తొలి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారు.

అదే విధంగా గతంలో తండ్రి సమాచార శాఖను నిర్వహిస్తే.. ఇప్పుడు కుమారుడు కూడా అదే శాఖకు మంత్రిగా వచ్చారు. మచిలీపట్నం నుంచి గెలుపొందని పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని)ని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రిగా నియమించారు జగన్.

గతంలో నాని తండ్రి పేర్ని కృష్ణమూర్తి కూడా సమాచారశాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో తండ్రి నిర్వహించిన శాఖనే.. మళ్లీ కొడుకు నిర్వర్తించడం ఏపీ చరిత్రలో ఇదే మొదటిసారి.

కాగా.. పేర్ని కృష్ణమూర్తి మంత్రిగా ఉన్న కాలంలో జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడ్డారు. ఈ క్రమంలో నాని కూడా గత ప్రభుత్వంలో పెండింగ్‌లో పెట్టిన గృహాలు, వేతన సవరణ, జర్నలిస్టులపై దాడుల నివారణకు చర్యలు తీసుకోవాలని పలువురు మీడియా ప్రతినిధులు కోరుతున్నారు.