ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర చరిత్రలో నూతన ఆధ్యాయానికి సీఎం జగన్ నాంది పలికారని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం సీఎం జగన్ 13 కొత్త జిల్లాలను ఏర్పాట్లు చేశారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర చరిత్రలో నూతన ఆధ్యాయానికి సీఎం జగన్ నాంది పలికారని మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజల సౌలభ్యం కోసం సీఎం జగన్ 13 కొత్త జిల్లాలను ఏర్పాట్లు చేశారని చెప్పారు. సీఎం జగన్ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. గత 43 ఏళ్లుగా జిల్లాలు పెంచాలని ఎవరూ ఆలోచన చెయ్యలేదన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబుకి ఎందుకు ఇలాంటి ఆలోచన రాలేదని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమయ్యిందని ప్రశ్నించారు. కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారని ఎద్దేవా చేశారు. ఈ అంశాలు పవన్ కల్యాణ్‌కు ఎందుకు కనిపించటం లేదని ప్రశ్నించారు. కొత్త జిల్లా ఏర్పాటుకు సంబంధించి పవన్ రాసిన లేఖపై మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. కొక్కునూరు ఏలూరు జిల్లాలో ఉంటే కనీస అవగాహన లేకుండా లేఖ రాశారని తెలిపారు. పవన్ కళ్యాణ్ బరి తెగించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. పవన్ చంద్రబాబు సలహాతో పవన్ కల్యాణ్ లేఖ రాశారని ఆరోపించారు.
అప్పట్లో అమరావతి భూములను బలవంతంగా తీసుకుంటే నడిరోడ్డు పై ఆందోళన చేస్తానని చెప్పి పవన్ కల్యాణ్... లుంగీ కట్టుకుని విమానంలో వచ్చి చంద్రబాబును కలిసి అంతా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయారని విమర్శించారు. పవన్ అమరావతి ప్రజలను మోసం చేశారని అన్నారు. అమరావతి ప్రజలను మోసం చేశారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు.
ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ ఏమైనా అధ్యయనం చేశారా?.. ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశారా..? అని పవన్ కల్యాణ్‌ను మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. చంద్రబాబు వాట్సప్, మెయిల్ పెట్టగానే ప్రింట్ అవుట్ తీసి మీడియాకు లేఖ విడుదల చేయటం తప్ప పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసని విమర్శలు గుప్పించారు.
