ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు గాను జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడ్డారు మంత్రి పేర్ని నాని. పవన్ నాయుడుకి మా ప్రభుత్వం చేసే మంచి పనులు కనపడటం లేదని.. లక్ష ఉద్యోగాలు ఇచ్చినా, హామీ లన్నీ అమలు చేస్తున్నా పవన్ కు మాత్రం ఇసుక కొరత మాత్రమే కనబడుతోందని ఎద్దేవా చేశారు.

కృష్ణ, గోదావరి వరద మీకు కనపడదని.. కేవలం చంద్రబాబు నాయుడు చెప్పిందే వినపడుతోందని.. చంద్రబాబు చెప్పింది విని రోడ్డు మీదకు రావడమే పవన్ లక్ష్యమంటూ ఎద్దేవా చేశారు. భవన నిర్మాణ కార్మికుల నిధులను హల్వాలా జల్సాలకు ఖర్చు పెట్టిన అచ్చెన్నాయుడును పక్కన కూర్చొని పవన్ మాట్లాడుతున్నారని మంత్రి దుయ్యబట్టారు.

చంద్రబాబు హయాంలో భవన నిర్మాణ కార్మికులను మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించ లేదని పేర్ని నాని నిలదీశారు. ఉద్యమం ఉన్న చోట వారిని పిలిపించుకుని మీటింగులు పెట్టారని.. ఖాళీగా ఉండి పవన్ రోజూ ట్వీట్లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

పవన్ ఏ రోజుకారోజు సంస్కారం నేర్చుకుంటారా.. పార్టీ పెట్టింది మొదలు.. జగన్ను విమర్శించడం మినహా ఏం చేశారని నాని ప్రశ్నించారు. విశాఖ లాంగ్ మార్చులో సంస్కారంతో మాట్లాడలేక పోయారెందుకంటూ ధ్వజమెత్తారు. సినిమాల్లో ఏం చేసినా ఎవరు ఎదురు చెప్పరు.. కానీ రాజకీయాల్లో ఎదురు చెప్పకుండా ఎలా ఉంటారుని నాని దుయ్యబట్టారు.

Also Read:నువ్వు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకో.. ఎవడొద్దన్నాడు: జగన్‌కు పవన్ కౌంటర్

పవన్ ఒక్కసారి తాట తీస్తే.. తాము పదిసార్లు తాట తీస్తామని.. జగన్ పై తప్పుడు కేసులు పెట్టిన చిదంబరం జైల్లో ఉన్నారని నాని గుర్తుచేశారు. పవనుకు పెళ్లిళ్ల మీద మక్కువ ఉంది కాబట్టి మూడు పెళ్ళిళ్లు చేసుకున్నారని.. కానీ జగనుకు ప్రజా సేవ, వ్యాపారం మీద మక్కువ ఎక్కువని మంత్రి స్పష్టం చేశారు.

వెంకయ్యను పవన్ తిట్టినంత అసహ్యంగా ఎవ్వరూ తిట్టలేదని.. ఇప్పుడు సూక్తి ముక్తావళి చెబుతున్నారని పేర్ని నాని సెటైర్లు వేశారు. లక్షల మంది యువతీ యువకుల కోరిక మీదటే ఇంగ్లిష్ మీడియంపై నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. దున్నపోతు ఈనిందని చంద్రబాబు అంటే దూడను కట్టడానికి పవన్ పరుగెత్తుకొస్తున్నారని నాని సెటైర్లు వేశారు.

పవనుకు నరనరాన కుల భావన జీర్ణించుకుపోయిందని.. తమను విమర్శిస్తున్న నేతలను రాజకీయ నేతల్లా కాకుండా వారి కులాల గురించి ఆరా తీస్తున్నారంటూ ఫైరయ్యారు. కాపులకు రిజర్వేషన్లు అక్కర్లేదని చంద్రబాబు హయాంలో చెప్పిన పవన్.. ఎన్నికల సమయంలో రిజర్వేషన్లు ఇస్తామన్న సంగతిని నాని గుర్తుచేశారు.

Also read:చంద్రబాబు దత్తపుత్రుడు: పవన్ కల్యాణ్ కు పెద్దిరెడ్డి కౌంటర్

కాపులను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసే నైజం పవన్ కల్యాణ్‌దని.. మ్యాన్ ఫ్రైడే అని పవన్ అనొచ్చు కానీ.. మ్యాన్ విత్ త్రి ఉమెన్ అని మేం అనకూడదా అని ప్రశ్నించారు. తెలుగు మాట్లాడితే ఫైన్ వేసే స్కూల్లో పవన్ కుమార్డు చదవొచ్చు కానీ.. పేదల పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదవకూడదా అని నాని నిలదీశారు.

పవన్ కంటే.. వంద రెట్ల ధైర్యం ఉన్న నేతలు మా పార్టీలో ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు. పవన్ నోటి తీటతో దేవుడిని కూడా వదలడం లేదన్నారు. పవన్ కల్యాణ్‌ కూడా గతంలో వైజాగులో కోర్టుల చుట్టూ వాయిదాలకు తిరిగిన సంగతిని నాని గుర్తుచేశారు. జగన్ ఏనాడూ వ్యక్తిగత దూషణలకు దిగలేదని మంత్రి స్పష్టం చేశారు. పవన్ సినిమాల్లో గబ్బర్ సింగేమో కానీ.. రాజకీయాల్లో రబ్బర్ సింగ్ అంటూ పేర్ని నాని సెటైర్లు వేశారు.