ఎస్ఈసీ నిమ్మగడ్డపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒకసారి మేనిఫెస్టో విడుదల చేశాక రద్దు చేస్తే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు

ఎస్ఈసీ నిమ్మగడ్డపై మండిపడ్డారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఒకసారి మేనిఫెస్టో విడుదల చేశాక రద్దు చేస్తే ప్రయోజనం ఏంటని ఆయన ప్రశ్నించారు.

మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పెద్దిరెడ్డి నిలదీశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోకుండా మేనిఫెస్టో రద్దు చేయడమేంటని మంత్రి ప్రశ్నించారు.

ఎస్ఈసీ యాప్‌ను వాడొద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని.. కోర్టు తీర్పుతో ఎస్ఈసీ పదవికి నిమ్మగడ్డ రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఓటు నమోదు చేయడం తెలియని వ్యక్తి ఎస్ఈసీ ఎలా అయ్యారని పెద్దిరెడ్డి సెటైర్లు వేశారు.

ఏకగ్రీవాలు చట్టవిరుద్ధమని ఏ చట్టంలో ఉందని రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబుకు మేలు చేసేందుకే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని... గుంటూరు, చిత్తూరు జిల్లాలో ఏకగ్రీవాలు ఎలా నిలిపివేస్తున్నారని నిలదీశారు.

టీడీపీని బతికించేందుకే నిమ్మగడ్డ ప్రయత్నిస్తున్నారని.. అధికారంలో వున్న మంత్రులు తప్పు చేస్తే సీఎం లేదా సీఎస్‌కు లేఖ రాయాలని పెద్దిరెడ్డి గుర్తుచేశారు. కానీ నిమ్మగడ్డ గవర్నర్‌కు లేఖ రాశారని ఆయన ఎద్దేవా చేశారు.

Also Read:చిన్న మెదడు చితికినట్లుంది: నిమ్మగడ్డపై రోజా సెటైర్లు

ప్రివిలేజ్ కమిటీ ఆదేశిస్తే నిమ్మగడ్డ విచారణకు హాజరు కావాల్సి వుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఎస్ఈసీ మాటలు విని అధికారులు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని పెద్దిరెడ్డి హెచ్చరించారు.

నిమ్మగడ్డ రిటైరయితే చంద్రబాబు అతని మొహం కూడా చూడరని పెద్దిరెద్ది స్పష్టం చేశారు. చిత్తూరు, గుంటూరు అధికారులు ఏకగ్రీవాలను వెంటనే ప్రకటించాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే అధికారులను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రి హెచ్చరించారు. ఎస్ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిన అవసరం లేదని.. చట్టాలకు లోబడి అధికారులు పనిచేయాలని రామచంద్రారెడ్డి హితవు పలికారు. జిల్లాలన్నీ తిరిగి ఎస్ఈసీ అధికారులను బెదిరిస్తున్నారని... రిటర్నింగ్ అధికారికి అన్ని అధికారాలు వుంటాయన్నారు.