సారాంశం

కాంగ్రెస్‌పై , మాజీ ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. పుట్టపర్తి సాయిబాబా చనిపోతే.. ఆయన పార్ధివ దేహాన్ని తరలించకుండా డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి అని ఆరోపించారు. 

కాంగ్రెస్‌పై , మాజీ ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డిపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డికి మడుగులు ఒత్తి, ఆయన చనిపోయాక జగన్‌పై విరుచుకుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి, రఘువీరారెడ్డి లాంటి ముఠాలు కాంగ్రెస్‌లో చాలా వున్నాయని .. అంతేకాకుండా తమ ఇన్‌ఛార్జ్ మంత్రిగా వుండి కనీసం తన నియోజకవర్గంలో పర్యటించలేదన్నారు. ఆయనకి తన గురించి ఏం తెలుస్తుందని పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. తాను ఖూనీలు చేశానని నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. 

పుట్టపర్తి సాయిబాబా చనిపోతే.. ఆయన పార్ధివ దేహాన్ని తరలించకుండా డబ్బు మూటలు సర్దుకున్న వ్యక్తి రఘువీరారెడ్డి అని ఆరోపించారు. రఘువీరా ఒక పొలిటికల్ బ్రోకర్ అని.. కాంగ్రెస్ పార్టీని తాము బ్రతికించానని చెప్పుకుంటున్నారని, నిజానికి కాంగ్రెస్‌ను చంపింది కిరణ్, రఘువీరారెడ్డిలేనని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. లక్షల కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు చెప్పుకోవడానికి ఏ పథకమైనా పెట్టారా అని రామచంద్రారెడ్డి ప్రశ్నించారు .

14 ఏళ్లు సీఎంగా వుండి తాను ఇది చేశాను అని చెప్పుకునే దిక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికల సంఘానికి తనపై ఫిర్యాదు చేయడం వల్ల తనకు ఎలాంటి నష్టం లేదని.. దానికంటే ముందు చంద్రబాబు కుప్పంలో గెలవాలని సెటైర్లు వేశారు. అనంతపురంలో భారీ సభ నిర్వహిస్తామని.. దీనిపై స్వయంగా సీఎం వైఎస్ జగన్ సైతం దృష్టి పెట్టారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.