స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఆరంభం మాత్రమే.. చంద్రబాబుపై ఎన్నో కేసులు : పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించడంపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. టీడీపీ బంద్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని.. చివరికి చంద్రబాబు సొంత సంస్థ కూడా నడుస్తోందని పెద్దిరెడ్డి చురకలంటించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ విధించడంపై స్పందించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతి చేయలేదని టీడీపీ నేతలే చెప్పలేకపోతున్నారని చురకలంటించారు. సాంకేతిక కారణాలతో మాత్రమే అరెస్ట్ అక్రమమంటున్నారని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. అవినీతి కేసుల్లో స్టేలతో చంద్రబాబు కాలం గడుపుతున్నారని.. చట్టం తనపని తాను చేసుకుంటూ పోతోందని ప్రజలకు తెలిసిందన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై ప్రజల్లో ఎలాంటి నిరసన రాలేదని మంత్రి పేర్కొన్నారు.
టీడీపీ బంద్‌ను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని.. చివరికి చంద్రబాబు సొంత సంస్థ కూడా నడుస్తోందని పెద్దిరెడ్డి చురకలంటించారు. స్కిల్ స్కామ్ కేవలం ఆరంభం మాత్రమేనని.. చంద్రబాబుపై ఇంకా చాలా కేసులు వున్నాయని రామచంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పక్కా ఆధారాలతో సీఐడీ దర్యాప్తు చేస్తోందని.. స్టేలతో ఇన్నాళ్లు చంద్రబాబు తప్పించుకుని తిరిగారని ఆయన చురకలంటించారు. పతనం అంటే ఏంటో చంద్రబాబుకు ఇప్పుడు అర్ధమయ్యిందని.. లోకేష్‌తో పాటు టీడీపీ నేతలు బెదిరింపు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చాత్తాపం కూడా లేకుండా వ్యవహరించడం దారుణమన్నారు.
ALso Read: కేసీఆర్ దగ్గర తప్పించుకున్నా జగన్ మాత్రం వదిలిపెట్టలేదు: చంద్రబాబు అరెస్ట్ పై అంబటి సంచలనం
పవన్ కల్యాణ్‌కు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయనడం అలవాటుగా మారిందని పెద్దిరెడ్డి ఫైర్ అయ్యారు. గతంలో వాలంటీర్లపై ఆరోపణలు, ఇప్పుడు 50 మంది హత్యలు అని అంటున్నారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై పోలీస్ విచారణ కోరుతామని.. అవి అబద్ధాలని తేలితే పవన్ పై పరువు నష్టం దావా వేస్తామని రామచంద్రారెడ్డి హెచ్చరించారు. చంద్రబాబు అరెస్ట్ అయితే.. పవన్ పడిన తపన లోకేష్‌లోనూ లేదన్నారు.
అంతకుముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకు స్కాములు చేయడం కొత్తకాదు... జైలుకు వెళ్ళడమే కొత్త అని మంత్రి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు ఇన్నాళ్ళు తప్పించుకున్నారు... కానీ అలాంటి రోజులకు కాలం చెల్లిందన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల డబ్బులతో ఎమ్మెల్యేను కొనాలనుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని... ఆ కేసులో చంద్రబాబు అరెస్ట్ నుండి తప్పించుకున్నారని అన్నారు.కానీ ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తప్పించుకోవడం కుదరలేదు... అందుకే అరెస్టయి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని మంత్రి అంబటి పేర్కోన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు విభజన తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక స్కాములు చేసారని... ఇవి ఆయనకు కొత్తేమీ కాదని అంబటి ఆరోపించారు. కానీ ఇన్నాళ్ళకు ఆయన అవినీతి, అక్రమాలు ఆధారాలతో సహా బయటపడంతో అరెస్టయ్యాడని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్రను గుర్తించిన సిఐడి అరెస్ట్ చేసింది... ఇందులో రాజకీయ కక్ష సాధింపులేమీ లేవని అన్నారు. చంద్రబాబుపై కక్షతో సీఎం జగన్ అరెస్ట్ చేయించారని టిడిపి ప్రచారం చేసుకుంటోందని... తద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. చంద్రబాబును జైలు కి పంపాలని ఎవరికి లేదు... ఇది దురదృష్టకమే అయినా తప్పు చేసివారికి శిక్ష తప్పదని అంబటి అన్నారు.