కేసీఆర్ దగ్గర తప్పించుకున్నా జగన్ మాత్రం వదిలిపెట్టలేదు: చంద్రబాబు అరెస్ట్ పై అంబటి సంచలనం
టిడిపి అధినేత చంద్రబాబు నాాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం వ్యవహారంలో అరెస్ట్ కావడంపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై మంత్రి అంబటి రాంబాబు రియాక్ట్ అయ్యారు. చంద్రబాబుకు స్కాములు చేయడం కొత్తకాదు... జైలుకు వెళ్ళడమే కొత్త అని మంత్రి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబు ఇన్నాళ్ళు తప్పించుకున్నారు... కానీ అలాంటి రోజులకు కాలం చెల్లిందన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల డబ్బులతో ఎమ్మెల్యేను కొనాలనుకుని రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని... ఆ కేసులో చంద్రబాబు అరెస్ట్ నుండి తప్పించుకున్నారని అన్నారు.కానీ ఇప్పుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తప్పించుకోవడం కుదరలేదు... అందుకే అరెస్టయి జైలుకు వెళ్లాల్సి వచ్చిందని మంత్రి అంబటి పేర్కోన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు విభజన తర్వాత కూడా ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక స్కాములు చేసారని... ఇవి ఆయనకు కొత్తేమీ కాదని అంబటి ఆరోపించారు. కానీ ఇన్నాళ్ళకు ఆయన అవినీతి, అక్రమాలు ఆధారాలతో సహా బయటపడంతో అరెస్టయ్యాడని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబు పాత్రను గుర్తించిన సిఐడి అరెస్ట్ చేసింది... ఇందులో రాజకీయ కక్ష సాధింపులేమీ లేవని అన్నారు. చంద్రబాబుపై కక్షతో సీఎం జగన్ అరెస్ట్ చేయించారని టిడిపి ప్రచారం చేసుకుంటోందని... తద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. చంద్రబాబును జైలు కి పంపాలని ఎవరికి లేదు... ఇది దురదృష్టకమే అయినా తప్పు చేసివారికి శిక్ష తప్పదని అంబటి అన్నారు.
అవినీతికి పాల్పడ్డాడని నమ్మబట్టే కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది... ఇలాంటి వ్యక్తికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మద్దతుగా నిలవడం ప్యాకేజీ కాదా? అని మంత్రి ప్రశ్నించారు. చంద్రబాబును అరెస్ట్ చేసారని రోడ్డుపైకి వచ్చి అరుస్తున్న పవన్ ఇలాగే ముద్రగడను అరెస్ట్ చేసినపుడు ఎందుకు బయటకు రాలేదని నిలదీసారు. అవినీతి కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతిస్తే పవన్ కు అందులో భాగమేమైనా వుందా అనుమానాలు వస్తాయని అంబటి అన్నారు.
Read More స్కిల్ డెవలప్‍మెంట్ కేసు : నేను అప్రూవర్ గా మారాననే ప్రచారం అవాస్తవం... మాజీ ఐఏఎస్ పీవి రమేశ్
ఏపీ రాజధాని పేరిట చేపట్టిన అమరావతి నిర్మాణం కూడా పెద్ద స్కామ్ అని మంత్రి ఆరోపించారు. దానిపై కూడా సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలన్నారు. చంద్రబాబు అధికారంలో ఉండగా చేసిన పనులన్నిటిపై విచారణ జరపాలన్నారు. ఎన్నికలు ముందు ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేయాలని ఎవరూ అనుకోరని... తప్పు చేసినట్లు తేలింది కాబట్టే చంద్రబాబు జైలుకు వెళ్లాడన్నారు. చట్టప్రకారం శిక్షపడితే టిడిపి బంద్ చేపట్టడం విడ్డూరంగా వుందన్నారు మంత్రి అంబటి రాంబాబు.
. .