నాడు కాంగ్రెస్‌‌ను వీడామని .. మా సెక్యూరిటీని తీసేశారు , జగన్‌ను జైల్లో పెట్టారు : షర్మిలపై పెద్దిరెడ్డి ఫైర్

కాంగ్రెస్‌ను వీడినప్పుడు మాకున్న గన్‌మెన్‌లను తొలగించారని , మా నాయకుడిని 16 నెలలు జైల్లో వుంచి ఇబ్బంది పెట్టారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. తమ నాయకుడు సింగిల్‌ గానే వస్తాడని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

minister peddireddy ramachandra reddy counter apcc chief ys sharmila ksp

తనకు వైఎస్ జగన్ ప్రభుత్వం భద్రత కల్పించడం లేదంటూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు వైసీపీ సీనియర్ నేత, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను వీడినప్పుడు మాకున్న గన్‌మెన్‌లను తొలగించారని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మా మద్ధతుతోనే గెలిచి.. మమ్మల్నే ఇబ్బంది పెట్టాలని చూశారని పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మా నాయకుడిని 16 నెలలు జైల్లో వుంచి ఇబ్బంది పెట్టారని రామచంద్రారెడ్డి తెలిపారు. 

మరోవైపు.. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల మధ్య పొత్తులపైనా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. కాంగ్రెస్ పరోక్షంగా టీడీపీకి మద్ధతు ఇస్తోందని, బీజేపీ నేతలంతా ఒకప్పుడు టీడీపీకి చెందినవారేనని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఎంతమందితో కలిసొచ్చినా.. తమ నాయకుడు సింగిల్‌ గానే వస్తాడని పెద్దిరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురంలో ఈ నెల 11న జరగాల్సిన సిద్ధం బహిరంగసభను 18కి వాయిదా వేసినట్లు ఆయన వెల్లడించారు. ముందు నుంచే ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసే వున్నాయని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. 

అంతకుముందు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. అడిగినా తనకు ఎందుకు సెక్యూరిటీ ఇవ్వడం లేదని, చెడు జరగాలనేనా అని నిలదీశారు. ఏపీసీసీ అధ్యక్షురాలిగా రాష్ట్రంలో తాను విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని, అందుకే తనకు భద్రత కూడా అవసరం అని షర్మిల చెప్పారు. తనకు భద్రత కావాలని ప్రభుత్వాన్ని అడిగినా.. స్పందించడం లేదని పేర్కొన్నారు. ఒక మహిళ అని కూడా చూడటం లేదని అన్నారు. అడిగినా భద్రత ఇవ్వడం లేని మీకు.. ప్రజాస్వామ్యంపై ఎంతటి చిత్తశుద్ధి ఉన్నదని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నదా? అసలు ప్రజాస్వామ్యం అని కనీసం గుర్తుకైనా ఉన్నదా? అని షర్మిల ప్రశ్నలు కురిపించారు. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా? మిగిలిన నాయకులకు ఉండనవసరం లేదా? అని అడిగారు. ప్రతిపక్షాలకూ రక్షణ కల్పించాల్సిన బాధ్యత లేదా? అని అన్నారు. అంటే.. మా చెడు కోరుకుంటున్నారనే కదా ఇక్కడ అర్థం అని ఆమె పరోక్షంగా అన్న జగన్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios