బీజేపీపై లోకేష్ ఘాటు వ్యాఖ్యలు

అమరావతి: కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఏపీ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీలను నెరవేర్చాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా మంగళవారం నాడు ట్వీట్ చేశారు.

ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవిలు చేస్తున్న ఆమరణ నిరహార దీక్ష ఏడు రోజులకు చేరుకొన్నా కానీ, ఇంతవరకు కేంద్రం స్పందించకపోవడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.ఏపీ ప్రజలపై బీజేపీ వైఖరి మరోసారి బయటపడిందన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మనోభావాలు దెబ్బతీయడం మంచిది కాదని లోకేష్ హితవు పలికారు. బీజేపీ నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారాన్ని వీడాలని ఆయన సూచించారు. బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీ యాత్రలు చేయాలని లోకేష్ హితవు పలికారు. రాష్ట్రంలో యాత్రలు చేస్తే ఏం ప్రయోజనమని ఆయన ప్రశ్నించారు. 

నాలుగేళ్ళుగా ఏపీకి ఇచ్చిన ఒక్క హమీని కూడ కేంద్రం అమలు చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.