అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై  ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. కేసీఆర్ బుద్ధి తక్కువ మనిషి అని, గలీజు రాజకీయ నాయకుడు అంటూ విమర్శించారు. మోదీ డైరెక్షన్లోనే కేసీఆర్ నడుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. 

తాము శ్వేత పత్రాలు విడుదల చేసుకుంటే కేసీఆర్ కు సంబంధం ఏంటని అసలు కేసీఆర్ కు విలువ ఉందా అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అసలు సిగ్గు ఉందా అంటూ నిలదీశారు. 2004లో కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికల బరిలో నిలిచిన కేసీఆర్, ఆ తర్వాత 2009లో చంద్రబాబు కాళ్లు పట్టుకుని తెలుగుదేశంతో పొత్తుకోసం వెంపర్లాడింది నిజం కాదా అని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు అని చెప్పుకొచ్చారు. 

ఉడత ఊపులకు చింతకాయలు రాలవన్నట్లు కేసీఆర్ వల్ల ఏపీలో ఏమీ జరగదన్నారు. కేసీఆర్ కు దమ్ముంటే ఏపీలో పోటీ చేసి డిపాజిట్ దక్కించుకోవాలని సవాల్ విసిరారు. కేసీఆర్ తన తాబేదార్ వైఎస్ జగన్ తో కలిసి పోటీ చేస్తాడో, బీజేపీతో కలిసి పోటీ చేస్తాడో దమ్ముంటే ఏపీలో పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు. 

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి మరోక రాష్ట్రముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం దురదృష్టకరమన్నారు. కేసీఆర్ వాడుతున్న భాషను చూసి ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. ముందు బాష నేర్చుకోవాలని హితవు పలికారు. 

చంద్రబాబు నాయుడుకు పదేపదే రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కేసీఆర్ చెప్తున్నాడని ఆయన ఏ గిఫ్ట్ ఇచ్చినా తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్, జగన్, బీజేపీ ముగ్గురు కలిసినా తెలుగుదేశం పార్టీ గెలుపును ఆపలేరని మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

చంద్రబాబు పెంచితేనే కేసీఆర్ నాయకుడు అయ్యారు

రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినా భారీ మెజారిటీతో గెలుస్తాం, ఆయన తిట్లే మాకు ఆశీర్వచనాలు

సీఎం అయినంత మాత్రాన కేసీఆర్ అలా చెండాలంగా మాట్లాడతారా