అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ రెండోసారి ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఏదో అయిపోయినట్లుగా ఊహించుకుంటున్నాడని విమర్శించారు. 

చంద్రబాబు నాయుడుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన సోమిరెడ్డి కేసీఆర్ కు మాట్లాడే భాష కనీసం కూలి చేసుకునే వాళ్లు తగువులాడుకున్నప్పుడు కూడా  మాట్లాడరన్నారు. 

ఒకప్పుడు చంద్రబాబు నాయుడును పొగుడుతూ అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబుపై ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతుంటే తొమ్మిదేళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు గురించి అలా మాట్లాడొద్దంటూ చెప్పింది కేసీఆర్ కాదా అంటూ నిలదీశారు. 

ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ నష్టపోతుందని కేసీఆర్ మేనల్లుడే స్వయంగా విమర్శించారని, ఇప్పుడు కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాస్తానంటున్నారని ఈ రాజకీయం ఏంటని నిలదీశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ అబద్దాలను నమ్మినట్లు ఏపీ ప్రజలు నమ్మరన్నారు. 

చంద్రబాబు నాయుడు మాటమీద నిలబడే వ్యక్తి అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు రాజకీయ అనుభవం ముందు కేసీఆర్ అనుభవం ఎక్కడ అన్నారు. తాము అధికారంలో ఉన్న ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామన్నారు.  

మోదీలాంటి ప్రధాని ఢీకొట్టిన ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు మాత్రమేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబును విమర్శించినంత మాత్రాన కేసీఆర్ ఏదో గొప్ప నాయకుడిలా ఫీలవుతున్నాడని విమర్శించారు. 

తెలంగాణ కంటే అన్ని రంగాల్లో ఏపీ ముందు ఉందని తాము తెలంగాణలో పథకాలను కాపీ కొడతామా అంటూ నిలదీశారు. అభివృద్ధిలో తెలంగాణ కంటే తామే ముందు వరుసలో ఉన్నామన్నారు. 

అన్ని రంగాల్లో 10.5శాతం అభివృద్ధితో తెలంగాణ కంటే ముందు ఉన్నామన్నారు. వ్యవసాయ రంగం దగ్గర నుంచి పారిశ్రామిక రంగం వరకు ఇలా అన్ని రంగాల్లో ఏపీ అగ్రగామిలో ఉందని అందుకు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన రిజల్ట్స్ నిదర్శనమన్నారు. 

తాము తెలంగాణ ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టాల్సినంత ఖర్మ తమకు పట్టలేదన్నారు. ఇంగ్లీషు వచ్చినంత మాత్రాన, ఉర్దూ వచ్చినంత మాత్రాన ముఖ్యమంత్రులు ప్రధానిమంత్రులు అయిపోరన్నారు. దేశ రాజకీయాలను శాసించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. 

ఏపీ ప్రభుత్వం విడుదల చేసే శ్వేత పత్రాలపై కేసీఆర్ వ్యాఖ్యలు సరికాదన్నారు. శ్వేత పత్రాల్లో ఎక్కడ తప్పుందో పట్టుకోవాలని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన రూ.1500కోట్లు సరిపోతాయా అంటూ నిలదీశారు. ఏపీ ప్రజలు మంచి రాజధానిని నిర్మించుకోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. 

రిటర్న్ గిఫ్ట్ ఇస్తా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారని ఇవ్వాలని చెప్పుకొచ్చారు. ఏపీలో అడుగుపెడితే ఆ రిటర్న్ గిఫ్ట్ ను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోతారని కేసీఆర్ చెప్పడం జోక్ అన్నారు. 

తెలంగాణ ప్రజలకు అరచేతిలో వైకుంఠం  చూపించిన కేసీఆర్ గెలిస్తే అభివృద్ధిలో తెలంగాణ కంటే ముందు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకు గెలవదన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 

కేసీఆర్ చంద్రబాబు నాయుడుని తిట్టినంత మాత్రాన శాపనార్థాలు పెట్టినంత మాత్రాన తమకు ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ తిట్లనే తాము ఆశీర్వచనాలుగా భావిస్తామన్నారు. కేసీఆర్ రాజకీయాల్లో చాలా అనుభవం కలిగిన వ్యక్తి అని ఇలాంటి భాష ఉపయోగించి తన గౌరవాన్ని తగ్గించుకోవద్దని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హితవు పలికారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

సీఎం అయినంత మాత్రాన కేసీఆర్ అలా చెండాలంగా మాట్లాడతారా