Asianet News TeluguAsianet News Telugu

విపక్షానికి భయపడే మంత్రులు ఉన్నా ఒకటే.. లేకున్నా ఒకటే : మంత్రి మేరుగు నాగార్జున సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మరోసారి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరుగుతుందంటూ వస్తోన్న వార్తలపై మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. మా దగ్గరున్న వాళ్లందరూ నిప్పులేనని.. ప్రతిపక్షాలకు భయపడే మంత్రులు ఎవరున్నారో మీడియాకే తెలియాలని మేరుగు పేర్కొన్నారు. 

minister merugu nagarjuna comments on ap cabinet reshuffle
Author
First Published Sep 8, 2022, 5:54 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ తప్పదంటూ జరుగుతున్న ప్రచారంపై మంత్రి మేరుగు నాగార్జున స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పరిపాలనలో భాగంగా ఎలాంటి మార్పులైనా చేసుకునే అధికారం సీఎంకు ఉంటుందన్నారు. ప్రతిపక్షాలకు భయపడే మంత్రులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనంటూ నాగార్జున ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థులకు భయపడే వాళ్లు రాజకీయాల్లో ఉండటం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మా దగ్గరున్న వాళ్లందరూ నిప్పులేనని.. ప్రతిపక్షాలకు భయపడే మంత్రులు ఎవరున్నారో మీడియాకే తెలియాలని మేరుగు పేర్కొన్నారు. లోకేష్ చెబితే మేం మంత్రులను మార్చాలా అని ఆయన ప్రశ్నించారు. 

చంద్రబాబు హయాంలో దళితులపై జరుగుతోన్న దాడులు చాలా ఉన్నాయని... లోకేష్ ఇప్పుడిప్పుడే పరామర్శలు నేర్చుకుంటున్నారని మేరుగు నాగార్జున వ్యాఖ్యానించారు. మేం దళిత వ్యతిరేకులమా, దళితులతో వియ్యం అందుకున్న చరిత్ర వైఎస్ జగన్‌దన్నారు. జగన్ పాలన దళిత సంక్షేమాన్ని కోరేదని.. ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం లేదని రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని లోకేష్ కామెంట్స్ చేస్తున్నారని ఫైరయ్యారు. అరేయ్ లోకేష్.. నువ్వు మమ్మల్ని.. మా నాయకుడిని బూతులు తిడతావా అంటూ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read:నవంబర్ లో జగన్ కేబినెట్ పునర్వవ్యస్థీకరణ: ముగ్గురు మంత్రులపై వేటు?

రాజారెడ్డి దేశానికి, రాష్ట్రానికి ఆణిముత్యాల్లాంటి నేతలను అందించారని.. చంద్రబాబు నీలాంటి పప్పు ముద్దలను అందించలేదని మంత్రి చురకలు వేశారు. చంద్రబాబు హయాంలో మహిళలను వివస్త్రలను చేసిన విషయం మరిచారా అంటూ నాగార్జున ప్రశ్నించారు. రాజధానిలో దళితులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదని కోర్టుకెళ్లిన చరిత్ర చంద్రబాబుదని, వారికి ఇళ్ల పట్టాలిస్తే సామాజిక సమత్యులత దెబ్బతింటుందంటారా అని ఆయన నిలదీశారు. చంద్రబాబు రాజకీయ సమాధి అయ్యారని.. తండ్రీకొడుకులు దళితుల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని నాగార్జున దుయ్యబట్టారు. జాతీయ కమిషన్ ఏమైనా దేవుళ్లా..? వాళ్లు వచ్చి ఏపీలో పరిస్థితులేంటో తెలుసుకోవాలని ఆయన సూచించారు. లోకేష్ నోటి వెంట బూతు మాట వస్తే నాలిక కోస్తామని.. వార్డు కౌన్సిలర్ కాలేని లోకేష్ మా గురించి మాట్లాడతారా అని మేరుగు నాగార్జున ఫైరయ్యారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios