అమరావతి: రాష్ట్రంలో ఒక పరిశ్రమ రావడం వలన మరొక పరిశ్రమకు గానీ, స్థానిక ప్రజలకుగానీ ఇబ్బంది కలగకూడదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హెచ్చరించారు. ఇవాళ మంత్రి 'దివీస్' ఫార్మా యాజమాన్యం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అలాగే తుని ఎమ్మెల్యే దాటిశెట్టి రాజా సహా తూర్పుగోదావరి జిల్లా అధికార యంత్రాంగంతో మంత్రి మేకపాటి వర్చువల్ గా సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా హ్యాచరీస్ పరిశ్రమకు విఘాతం కలగని విధంగా ముందుకు వెళ్లాలని మంత్రి మేకపాటి ఆదేశించారు. అలాగే భూగర్భంలోకి దివీస్ వ్యర్థాలు వెళ్లకుండా ఏవైనా చర్యలు చేపట్టారా? అని పీసీబీ అధికారులను ఆరా తీశారు. దివీస్ తో సహా ఇతర పరిశ్రమలలోని కాలుష్యంపై లోతుగా అధ్యయనం చేయాలన్న మంత్రి మేకపాటి ఆదేశించారు. 

పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం జవ్వాది అధ్యక్షతన సిఐబిఎ, ఎస్ఐఎఫ్‌టి,మెరైన్ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మేకపాటి ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలోగా దివీస్ సహా ఇతర పరిశ్రమలలోని కాలుష్యం, నియంత్రించే విధానం, చేపట్టవలసిన చర్యలపై నివేదిక అందజేయాలన్నారు.

ఈ సమావేశం తర్వాత తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో ఫోన్ లో ప్రత్యేకంగా మాట్లాడారు మంత్రి మేకపాటి. దివీస్ గురించి మాత్రమే కాదు రాబోయే పరిశ్రమలు, పెట్టుబడుల గురించి కూడా ఆలోచన అవసరమన్నారు. ఈ క్రమంలో దివీస్ అంటేనే పట్టుకోలేని ఆగ్రహంతో స్థానిక ప్రజలు ఉన్నారని తుని ఎమ్మెల్యే మంత్రికి తెలిపారు. 

పరిశ్రమల శాఖ డైరెక్టర్, దివీస్ పరిశ్రమ కలిసి ప్రజల ఆలోచనలు, ఆరోపణలు, ఆవేశాలు పరిగణలోకి తీసుకుని ఒకే తాటిపైకి వచ్చేలా చర్చించాలని సూచించారు.స్థానిక ప్రజలు, మత్స్యకారుల ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రథమ ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు.దివీస్ సమస్య పరిష్కారంలో జాప్యం జరిగితే ఫార్మా రంగంపైనే ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు.


దివీస్ పరిశ్రమకు వ్యతిరేకంగా పోరాడుతూ అరెస్ట్ అయిన వారిని తక్షణమే విడుదల చేయాలని...ఈ విషయంలో ఆలస్యం మంచిది కాదని దివీస్ పరిశ్రమ డైరెక్టర్ కు సూచించిన పరిశ్రమల శాఖ మంత్రి.  అయితే ఇప్పటికే చాలా వరకూ విడుదలయ్యారని, ఎక్కడైనా ఇతర కేసులున్నా ఉపసంహరించుకుంటామన్న దివీస్ డైరెక్టర్ మంత్రితో తెలిపారు. 

ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అద్నాన్ సమీ, మత్స్యశాఖ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు , పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్,  ఇతర అధికారులు పాల్గొన్నారు.