కరోనా కల్లోలం... మంత్రి మేకపాటికి పాజిటివ్
ఇప్పటికే అనేకమంది మంత్రులు ఈ వైరస్ బారినపడగా తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరిపోయారు.
నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. సామాన్యులనే కాదు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులనూ వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే అనేకమంది మంత్రులు ఈ వైరస్ బారినపడగా తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఆ జాబితాలో చేరిపోయారు. స్వల్ప లక్షణాలుండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు మేకపాటి ప్రకటించారు.
ప్రస్తుతం మేకపాటి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వుండటంతో హోమ్ ఐసోలేషన్‌లోనే ఉంటూ వైద్యం అందుకుంటున్నారు. మేకపాటికి కరోనా సోకినట్లు తెలియగానే ఆయన కుటుంబసభ్యులతో పాటు వైసీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలయ్యింది. అయితే ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా టెస్ట్ చేయించుకోవాలని మంత్రి సూచించారు.
ఇక తమ ప్రియతమ నాయకుడికి కరోనా సోకినట్లు తెలియడంతో అనుచరులు, వైసిపి కార్యకర్తలు త్వరగా కోలుకోవాలని ఆలయాల్లో పూజలు చేస్తున్నారు. అలాగే సహచర మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా మేకపాటి త్వరగా కోలుకోవాలంటూ కోరుకుంటూ ట్వీట్లు పెడుతున్నారు.
read more ఏపీలో కరోనా విలయతాండవం: 10 వేలు దాటిన కేసులు.. చిత్తూరు, సిక్కోలులో బీభత్సం
ఇక ఇప్పటికే జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కరోనా బారినపడ్డారు. అలాగే పక్కరాష్ట్రం తెలంగాణలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్, ఎంపీ జోగినిపల్లి సంతోష్ కూడా కరోనాతో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే కర్ణాటక సీఎం యడ్యూరప్ప, యూపీ సీఎం యోగి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాటు పలువురు కేంద్రమంత్రులు కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.