నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. 

ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, ఎస్పీ భాస్కర్ భూషణ్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ కన్వీనర్ లక్ష్మీ సునంద, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి తదితరులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ  కరోనా వాక్సిన్ సురక్షితం..శ్రేయస్కరం అని చెప్పారు. నెల్లూరు జిల్లాలో మొత్తం 26 ప్రాంతాల్లో వాక్సినేషన్ పంపిణీ చేస్తున్నామని,  ప్రతి కేంద్రంలో 100 చొప్పున నిత్యం 2600 మందికి వాక్సిన్ పంపిణీ చేస్తామన్నారు. 

"

వాక్సిన్ మీద భయాలు వద్దని, ప్రతి ఒక్కరూ వాక్సిన్ ను తీసుకోవాలని పిలుపునిచ్చారు. కోవిడ్ మహమ్మారిని అంతమొందించేలా దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ జరుగుతోందని తెలిపారు. కరోనాపై టీకా తయారు చేయడం మన దేశంలో ఇదే తొలిసారి అని, గతంలో ఏ వ్యాధి, వైరస్ వచ్చినా విదేశాలలో తయారైన టీకా తీసుకునేవాళ్లం అని.. బయోటెక్నాలజీ, ఫార్మా రంగాలలో పెరిగిన సాంకేతికత వల్ల ప్రపంచానికే టీకా అందించే స్థాయికి మనం ఎదగగలిగాం అని అన్నారు.
 
వైద్యులు సహా కరోనాపై ముందుండి పోరాడిన వారికి వాక్సిన్ పంపిణీలో మొదటి ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్బంగా మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.