ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) అంత్యక్రియలను బుధవారం నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్నారు. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మంత్రి గౌతమ్‌రెడ్డి (Mekapati Goutham Reddy) అంత్యక్రియలను బుధవారం నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం వరకు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో ఉంచనున్నారు. రేపు ఉదయం రోడ్డు మార్గంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని తీసుకువస్తారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో నెల్లూరుకు గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని తరలించనున్నారు. రేపు నెల్లూరులో కార్యకర్తల అభిమానుల సందర్శనార్ధం గౌతమ్ రెడ్డి ఇంట్లో భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం ఒంటి గంటకు బ్రాహ్మణపల్లిలో ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
మరోవైపు ప్రస్తుతం అమెరికాలో ఉన్న గౌతమ్ రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి.. తండ్రి మరణవార్త తెలిసి స్వగ్రామానికి పయానమయ్యాడు. రేపు సాయంత్రం ఆయన నెల్లూరుకు చేరుకోనున్నారు. ఎల్లుండి కుమారుడి చేతుల మీదుగా గౌతమ్ రెడ్డి అంతిమ సంస్కారాలను నిర్వహించనున్నారు. అంత్యక్రియల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పలువురు రాష్ట్ర మంత్రలు, వైసీపీ నాయకులు పాల్గొననున్నారు.
గౌతమ్ రెడ్డి మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రోజులు సంతాప దినాలను ప్రకటించింది. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. ఇక, మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది.
హైదరాబాద్‌లో గౌతమ్ రెడ్డి భౌతికకాయానికి నివాళులర్పించిన అనంతరం ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సీఎం జగన్‌కు గౌతమ్‌రెడ్డి ఎంతో సన్నిహితుడని తెలిపారు. గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని రేపు ఉదయం నెల్లూరు తరలించనున్నట్టగా చెప్పారు. అమెరికాలో ఉన్న గౌతమ్‌రెడ్డి కుమారుడు రేపు సాయంత్రం నెల్లూరుకు వస్తారని తెలిపారు. ఎల్లుండి స్వగ్రామం బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు. అంత్యక్రియల్లో సీఎం జగన్ పాల్గొంటారు తెలిపారు.
ఇక, గౌతమ్ రెడ్డి 1971 నవంబర్ 2వ తేదీన గౌతమ్ రెడ్డి జన్మించారు. ఆయన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తనయుడు. గౌతమ్ రెడ్డి స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండం బ్రాహ్మణపల్లి. ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీలో గౌతమ్ రెడ్డి ఎమ్మెస్సీ పూర్తి చేశారు. వైసీపీ ఆరంభం నుంచి మేకపాటి కుటుంబం వైఎస్ జగన్‌తోనే ఉంది. నెల్లూరు జిల్లా నుంచి పారిశ్రామిక వేత్తగా ఉన్నారు.
మేకపాటి గౌతమ్ రెడ్డి 2014లో రాజకీయ ప్రవేశం చేశారు. 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్మకూరు నుంచి వైసీపీ తరఫున బరిలో నిలిచిన గౌతమ్ రెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే ఆయనకు గుండెపోటు రావడంతో.. ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పరిస్థితి విషమించిడంతో ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన తల్లిదండ్రులు, భార్య, పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
