తిరుపతి: గతంలో చంద్రబాబు అధికారంలో వుండగా ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేశారని... ఆ శాపమే అసెంబ్లీ ఎన్నికల్లో తగిలి చిత్తుగా ఓడిపోయారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీ సాధించిన విజయానికి మించిన హిస్టారికల్ విజయం వైసీపీ ది అని అన్నారు. కాబట్టి ఇప్పటికైనా చంద్రంబాబు అండ్ కో మా నాయకుడు జగన్ పై ఆరోపణలు మానుకోవాలని కన్నబాబు సూచించారు. 

పులివెందుల ఫ్యాక్షన్ అంటూ పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా రాయలసీమ అభివృద్ధి చూసి మాట్లాడాలన్నారు. కేంద్రం పెంచిన పెట్రోల్, డీజల్  రేట్లుపై ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాటం లేదని మంత్రి కన్నబాబు ప్రశ్నించారు. 

పవన్ కల్యాణ్ మైకు పట్టుకుంటే భారీ డైలాగ్‌లు చెబుతారని... ఆ తర్వాత అవన్నీ మర్చిపోతారని కన్నబాబు ఆరోపించారు. గతంలో జరిగిన తిరుపతి సభలో మోదీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన విషయం పవన్‌కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలు అంటూ ఎద్దేవా చేసింది పవన్‌కు గుర్తులేదా? అని కన్నబాబు విమర్శించారు. 

ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యపై ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని... అయితే ఈ విషయంపై ఇంటెలిజెన్స్ చీఫ్‌కి సీఎం రమేష్‌కి మధ్య ఫోన్‌ సంభాషణలు పవన్‌కు తెలియదా? చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్య కేసులో ఆధారాలు తుడిచిపెట్టారన్నారు.  అప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? అని కన్నబాబు ప్రశ్నించారు.