మంత్రివర్గంలో ఒకే ఒక్కడు.  అందరికన్నా మిన్నగా నిలిచిన మంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి కెఎస్ జవహర్. మొన్నటి మంత్రివర్గం విస్తరణలో కొత్తగా బాధ్యతలు తీసుకున్న జవహర్ నెంబర్ 1గా నిలిచారు. ఇంతకీ జవహర్ నెంబర్ 1గా ఎక్కడ నిలిచారనే సందేహం వస్తోందా? అయితే, ఈ కథనం చదవాల్సిందే.

ఇటీవలే జన్మభూమి కార్యక్రమం ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమంలో జనాలు ఎక్కడికక్కడ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపిలతో పాటు అధికారులను కూడా నిలదీసారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జనాల్లో చైతన్యం కనబడింది. చివరకు భాజపా-టిడిపి నేతల మధ్య కూడా చాలా చోట్లే గొడవలయ్యాయి. అటువంటి నేపధ్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు మంత్రి కెఎస్ జవహర్ కు ఏ + గ్రేడు దక్కించుకున్నారు.

చంద్రబాబునాయుడు క్యాంపు కార్యాలయంలో జరిగిన తెలుగుదేశం పార్టీ వర్క్ షాపులో అధికారంగా పై విషయాన్ని ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా అందటంతో పాటు ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిష్కారించి తక్షణమే ఆన్ లైన్ చేయడంతో జవహర్ కు  90-100 మార్కులతో A+ గ్రేడ్ వచ్చింది. ఈ సందర్భంగా చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు జవహర్ ని ప్రత్యేకంగా అభినందించారు.

జవహర్ కు ఏ + గ్రేడు దక్కటం వరకూ బాగనే ఉంది. మరి మిగిలిన మంత్రులంతా ఏమి చేస్తున్నట్లు? మంత్రివర్గంలో జవహర్ కన్నా అత్యంత సీనియర్లున్నారు. వారెవరికీ ఏ గ్రేడు దక్కలేదంటే వారి పనితీరుపై అనుమానాలు వస్తున్నాయ్.  అంతెందుకు భావి ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న నారాలోకేష్ కు ఏ గ్రేడు దక్కిందో తెలీదు.

మంత్రులే కాకుండా మాజీమంత్రులున్నారు, ఎంఎల్ఏలున్నారు. మరి వారి నియోజకవర్గాల్లో జన్మభూమి కార్యక్రమాలు సక్రమంగా జరగలేదా అన్న సందేహాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి. ఒక్క మంత్రికి మాత్రమే జన్మభూమి నిర్వహణలో ఏ గ్రేడు దక్కితే రాష్ట్రం మొత్తం మీద కార్యక్రమం అద్భుతంగా జరిగిందని చంద్రబాబు చెప్పటంలో అర్ధమేంటి?