పీఆర్‌పీని మూయించే వరకు నిద్రపోలేదు.. ఇప్పుడు పవన్‌ను కూడా : చంద్రబాబుపై మంత్రి కొట్టు సంచలన వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మూయించే వరకు చంద్రబాబు నిద్రపోలేదని ఆరోపించారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటంతో పవన్ కల్యాణ్ గ్రాఫ్ వేగంగా పడిపోతోందన్నారు. పవన్ గ్రాఫ్ పడేసేందుకు పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్‌ను శాశ్వతంగా అడ్డు తొలగించుకునేందుకు ఆయతో లేనిపోనివి మాట్లాడిస్తున్నారని మంత్రి మండిపడ్డారు. గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని మూయించే వరకు చంద్రబాబు నిద్రపోలేదని కొట్టు సత్యనారాయణ ఆరోపించారు.
వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు సహా చాలా మంది ఖాతాలు మూయిస్తామన్నారు. చంద్రబాబుకు సన్నిహితంగా వున్న సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను అరెస్ట్ చేశారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. సీఐ అంజూ యాదవ్ తప్పు వుంటే.. ఆమెపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు శనిలాంటి వాడని, ఆయనను వదిలేస్తేనే పవన్‌కు రాజకీయ భవిష్యత్తు వుంటుందన్నారు. గెలిచిన ఒక్క ఎమ్మెల్యేను కూడా పవన్ కల్యాణ్ కాపాడుకోలేకపోయారని మంత్రి దుయ్యబట్టారు. హిందూ ధర్మం గురించి పవన్‌కు ఏం తెలుసు, అసలు ఆయన పాటించారా అని కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు.
ALso Read: చెగువేరా నుంచి గాడ్సే వైపు పవన్.. దళారీ అవతారం: పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు.. పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ నిలకడలేని మనిషి అని అన్నారు. ఆయన ఒక్క చోట మూడు నిమిషాలు స్థిరంగా నిలబడలేడని విమర్శించారు. ఆయన రాజకీయాలు కూడా అలాగే అస్థిరమైనవని అన్నారు. పవన్ కళ్యాణ్ చెగువేరా డ్రెస్ వేసుకుని ఇప్పుడు సావర్కర్ డ్రెస్ వేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆ తర్వాత గాడ్సేలా తుపాకీ కూడా పట్టుకుంటాడని తాను సందేహిస్తున్నట్టు చెప్పారు. టీడీపీ, బీజేపీల మధ్య ఆయన ఒక దళారీ అవతారం ఎత్తారని విమర్శలు సంధించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగారు. కానీ, ఆ కూటమి ఏమంతా ఆశాజనక ఫలితాలను ఇవ్వలేదు. వామపక్షాలతో కలిసి ఎన్నికల్లో దిగిన పవన్ కళ్యాణ్ నేడు రైట్ వింగ్ గూటికి చేరుకున్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఎన్డీయే కూటమి సమావేశానికి పవన్ కళ్యాణ్ హాజరుకాబోతున్నారు.