టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై ఫైరయ్యారు మంత్రి కొడాలి నాని. ఎన్440కే పై జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఎన్‌సీబీ 420 వైరస్ వుందని కనుక్కున్నామని నాని సెటైర్లు వేశారు.

ఈ విషయాన్ని ప్రజలు కూడా కనుక్కున్నారని అందుకే ఎన్నికల్లో చిత్తుగా ఓడారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని మంత్రి తెలిపారు. చంద్రబాబు తన ఫ్యామిలీకి సింగపూర్ నుంచి వ్యాక్సిన్ తెప్పించుకున్నారని.. మరి నాయకులు, కార్యకర్తల ప్రాణాలు అవసరం లేదా అని కొడాలి నాని ప్రశ్నించారు.

చంద్రబాబు రాజకీయంగా, తండ్రిగా, అల్లుడిగా విఫలమయ్యారని.. టీడీపీ అనే స్మశానానికి చంద్రబాబు కాటికాపరి లాంటి వారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్‌పై చంద్రబాబుకు మోడీని ప్రశ్నించే దమ్ముందా అని కొడాలి నాని నిలదీశారు.

Also Read:చంద్రబాబు విష ప్రచారం వల్లే.. తెలుగు ప్రజలపై ఆంక్షలు: సజ్జల ఘాటు వ్యాఖ్యలు

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు విష ప్రచారం వల్లే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయాణీకుల రాకపోకలపై ఆంక్షలు విధించాయని ఎద్దేవా చేశారు. 

సంయమనం పాటించాల్సిన సమయంలో టీడీపీ అధినేత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తెలుగు ప్రజల రాకపోకలపై కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయని సజ్జల వెల్లడించారు. కొత్త వేరియంట్‌ అంటూ అసత్య ప్రచారాలు చేసినందు వల్ల ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు.. ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిషేధం విధించాయని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.

ఎన్‌440కే స్ట్రెయిన్‌ వ్యాప్తి అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని, రాజకీయం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కరాష్ట్రంలో కూర్చొని ఏపీని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.