ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు విష ప్రచారం వల్లే రెండు తెలుగు రాష్ట్రాలు ప్రయాణీకుల రాకపోకలపై ఆంక్షలు విధించాయని ఎద్దేవా చేశారు.  సంయమనం పాటించాల్సిన సమయంలో టీడీపీ అధినేత రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే తెలుగు ప్రజల రాకపోకలపై కొన్ని రాష్ట్రాలు ఆంక్షలు విధించాయని సజ్జల వెల్లడించారు. 

కొత్త వేరియంట్‌ అంటూ అసత్య ప్రచారాలు చేసినందు వల్ల ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు.. ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిషేధం విధించాయని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఎన్‌440కే స్ట్రెయిన్‌ వ్యాప్తి అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని, రాజకీయం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కరాష్ట్రంలో కూర్చొని ఏపీని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారని రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. 

Also Read:ఏపీలో ఎన్ 440కే పై గందరగోళం: సీసీఎంబీ ఏం చెప్పిందంటే

న్‌440కే అంత ప్రమాదం కాదని శాస్త్రవేత్తలే చెబుతున్నారని.. కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎన్‌440కే స్ట్రెయిన్‌ చాలా రోజుల నుంచే ఉందని సీసీఎంబీ చెప్పిన విషయాన్ని సజ్జల వెల్లడించారు. సీసీఎంబీ, సెంట్రల్ బయో టెక్నాలజీలు.. ఈ స్ట్రెయిన్‌తో ప్రమాదం లేదని ఇప్పటికే స్పష్టం చేశాయని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.

ప్రభుత్వం ఏం చేసినా విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటైందని ఆయన ఎద్దేవా చేశారు. ఆయన ఏం చేసినా ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రికి ఉందని సజ్జల స్పష్టం చేశారు. కానీ ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ప్రజలను భయపెట్టే విధంగా వ్యవహరించడం తగదని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.