రానున్న మూడున్నరేళ్లలో 30 లక్షల ఇళ్లు ఇస్తామన్నారు మంత్రి కొడాలి నాని. ఒకవేళ ఇవ్వలేకపోతే ఓట్లు అడగబోమని ఆయన తేల్చి చెప్పారు. విపక్షాలు అడ్డంకులు సృష్టించినా ఇళ్లు ఇచ్చి తీరుతామని నాని స్పష్టం చేశారు.

ప్రభుత్వంపై చంద్రబాబు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి మండిపడ్డారు. టీడీపీ నేతలను జగన్నాథ రథ చక్రాల కింద నల్లిని నలిపినట్లు నలిపేస్తామని హెచ్చరించారు.

‘నా ఇల్లు-నా సొంతం’ అంటూ ఓడిపోయిన టీడీపీ నాయకులు రోడ్డెక్కి షో చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడలో ఒక్క ఇల్లయినా ఇచ్చి చూపించాలన్నారు.

చంద్రబాబు కోర్టులకు వెళ్లి ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నారని కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడలో 25 వేల మంది లబ్ధిదారులకు 2024 లోపు ఇళ్లు కట్టించి ఇవ్వకపోతే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని పేర్కొన్నారు.

టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చి తీరుతామని కొడాలి నాని తెలిపారు. ఇళ్లు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు రూ.25 కోట్లు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు నుంచి స్టే తీసుకొస్తారని మంత్రి సెటైర్లు వేశారు.

పేదవాడికి పట్టా ఇవ్వాలి గాని.. రిజిస్ట్రేషన్ చేసి అమ్ముకునే హక్కు ఇవ్వకూడదని చంద్రబాబు స్టే తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.