పేదలు ఉండని చోట చట్టసభలు ఎందుకని ప్రశ్నించారు ఏపీ మంత్రి కొడాలి నాని. ఇదే విషయం సీఎం జగన్‌కు చెప్పారని.. తన ఆలోచన బాగుందని ముఖ్యమంత్రి అన్నారని వివరించారు.

మంత్రులు , తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా తన ప్రతిపాదనకు ఓకే చెప్పారని నాని చెప్పారు. ఒక సింగపూర్ కంపెనీకి 1500 ఎకరాలు ఇచ్చినప్పుడు 55 వేల మందికి 1500 ఎకరాలు ఇవ్వడం తప్పా అని ఆయన నిలదీశారు.

ఇప్పటికైనా రైతులు ప్రభుత్వంతో మాట్లాడితే మంచిదని నాని హితవు పలికారు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకునే కమ్యూనిస్టుల మాట వింటే రైతులు నష్టపోతారని మంత్రి ఆరోపించారు.

Also Read:అమరావతిపై సంచలన వ్యాఖ్యలు... కొడాలి నాని దిష్టిబొమ్మకు శవయాత్ర (వీడియో)

నా దిష్టిబొమ్మలు దగ్థం చేస్తే నాకు ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. అంతకుముందు అమరావతిని శాసన రాజధానిగా కూడా కొనసాగించవద్దని తాను సీఎం జగన్ ను కోరినట్లు మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో అమరావతి ప్రాంతంలో మళ్లీ ఆందోళనలు మరింత ఉదృతమయ్యాయి.

మంత్రి కొడాలి వ్యాఖ్యలపై సీరియస్ అయిన ఉద్దండరాయునిపాలెం రైతులు ఆయన దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అమరావతి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలని... ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకోవాలని సూచించారు. మంత్రి కొడాలి నానికి ఇప్పటికయినా బుద్ధి రావాలని కోరుకుంటున్నామని అన్నారు.