ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి కొడాలి నాని. కృష్ణా జిల్లా నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో శుక్రవారం మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ జడ్జిమెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి గూగుల్‌లో జగన్మోహన్ రెడ్డి గురించి కొడితే ఏదో వస్తుందని అంటున్నారంటూ మండిపడ్డారు. తాను జగన్మోహన్ రెడ్డి గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఆయన కుటుంబ నేపథ్యం ఉందని నాని తెలిపారు. 

2009లో జగన్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవతలి వైపు ఎంత బలవంతులు ఉన్నా ఢీ కొట్టే వ్యక్తిగా ఉందన్నారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన వ్యక్తిగా గూగుల్‌లో నాకు జగన్ గురించి కనిపించిందని మంత్రి వెల్లడించారు. 

చూసే వాళ్లు ఏది కావాలంటే అదే గూగుల్‌లో వస్తుందని.. పదవి విరమణ చేసిన న్యాయమూర్తి గుగూల్ సెర్చ్ చేస్తే వచ్చిందని ఆర్డర్‌లో పెట్టారని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌లో చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ నొక్కినా అదే వస్తుందన్నారు.

కానీ తాము నోక్కితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ఎవరి కాళ్లు పట్టుకోడు, ఎవరి సంక నాకడని.. దేశ చరిత్రలో 40 ఏళ్ల చరిత్ర గల పార్టీలతో ఢీకొట్టినట్లు మాకు కనిపిస్తుందంటూ నాని వ్యాఖ్యానించారు. 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ మంచి పనిచేసినా అడ్డం పడాలనే దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఉన్నారంటూ మంత్రి ఆరోపించారు ఎంతమంది దుర్మార్గులు కలిసి అడ్డుపడ్డా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హమీని అమలు చేస్తారని కొడాలి నాని స్పష్టం చేశారు.

ప్రజలను, దేవుణ్ని, దివంగత నేత రాజశేఖర రెడ్డిని నమ్ముకొని జగన్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారని నాని తెలిపారు. దేవుడి ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులతో.. జగన్ నిజాయితీగా అవినీతి లేని పాలన‌ చేస్తున్నారని మంత్రి ప్రశంసించారు. రాష్ట్రంలోకి చాలా మంది వస్తుంటారు పోతుంటారు వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.