Asianet News TeluguAsianet News Telugu

టిడిపి కబ్జా కోసం బాలక్రిష్ణ, యనమల పోటీ: కారుమూరి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు యథేచ్ఛ దోపిడి ప్రజలకు అర్థమైంది. అందుకే ఆయనకు కనీస ప్రజా స్పందన కరవైందంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి  కారుమూరి వెంకటనాగేశ్వరరావు అన్నారు. 

Minister Karumuri Venkatanageswara Rao comments on nara lokesh, chandrababu arrest - bsb
Author
First Published Sep 12, 2023, 4:07 PM IST

తాడేపల్లి : చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై ప్రజల్లో సానుభూతి లేదు అంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు కామెంట్ చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబునాయుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపారని, ఈ అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు పక్కాగా ఉన్నాయన్నారు. అందుకే ఢిల్లీ నుంచి రోజుకు కోటి రూపాయలు తీసుకునే లాయర్లు వచ్చి వాదించినా, చంద్రబాబుకు రిమాండ్‌ తప్పలేదన్నారు. 

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తే.. ప్రజా స్పందన లేదు. చివరకు ఆ పార్టీ నాయకులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అంటే బంద్‌కు ఎవరూ సహకరించలేదు. చివరకు హెరిటేజ్‌ షాపులన్నీ తెరిచే ఉన్నాయి. చంద్రబాబు జైలుకు పోయినా, ప్రజలు ఆయనపై సానుభూతి చూపడం లేదు. ఎందుకంటే, చంద్రబాబు పాలనతో తమకు ఏ మేలూ జరగలేదని ప్రజలంతా భావిస్తున్నారని చెప్పుకొచ్చారు. 

ఎప్పుడు చంద్రబాబు పదవిలో ఉన్నా.. దోచుకో.. దాచుకో.. పంచుకో.. అన్నట్లు వ్యవహరించారు. అందుకే ప్రజలు అయ్యో అని కూడా అనడం లేదన్నారు. ఆ తరువాత మాట్లాడుతూ.. నాది ఒకటే ప్రశ్న.. చంద్రబాబు అవినీతిపరుడు కాదని ఆయన కొడుకు లోకేశ్‌ చెప్పగలడా? అన్నారు. చంద్రబాబు అవినీతి చేయలేదు..అని ఆ పార్టీ నేతలు కూడా చెప్పలేరు. ఎన్టీఆర్‌ ఫ్యామిలీ కూడా చంద్రబాబు అవినీతిపరుడు కాదని చెప్పదు. చంద్రబాబు అవినీతి వ్యవహారం ప్రజలకు కూడా బాగా అర్ధమైంది. డొల్ల కంపెనీలు పెట్టి, యథేచ్ఛగా ఖజానా దోచుకున్నాడని అందరికీ తెలిసిందేనన్నారు. 

తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ గురించి మాట్లాడుతూ.. ఆయనది సుపరిపాలన అన్నారు. నీతి ఆయోగ్‌ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఈ నాలుగేళ్లలో 11.10 శాతం ఉన్న పేదరికం 6 శాతానికి తగ్గింది. జగన్‌ సుపరిపాలన అందిస్తున్నారు. అందుకే చంద్రబాబు హయాంలో 15వ స్థానంలో ఉన్న చదువులు.. ఇప్పుడు దేశంలో 3వ స్థానానికి వచ్చాయి. అలాగే చంద్రబాబు హయాంలో 12వ స్థానంలో ఉన్న పేదరికం, ఈరోజు 6వ స్థానానికి వచ్చింది. 

ఇదంతా జగన్‌ నిష్పక్షపాలన, నిజాయితీతో పథకాలు అమలు వల్లనే సాధ్యమైంది. రాష్ట్రంలో జగన్‌ చదువుల విప్లవం తీసుకొచ్చారు. పథకాలు, కార్యక్రమాలతో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారు సీఎం వైయస్‌ జగన్‌. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఎంతో మేలు చేస్తున్న ఆయనే మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని జోస్యం చెప్పారు.

రాజమండ్రి జైలులో మావోయిస్టులు ఉన్నా చంద్రబాబుకు ఇబ్బంది లేదు.. హోం మంత్రి తానేటి వనిత కీలక వ్యాఖ్యలు

ఇదే తరహాలో చంద్రబాబు కూడా పాలించి ఉంటే, రాష్ట్రంలో పేదరికం లేకుండా ఉండేది. కానీ అవినీతిపరుడైన చంద్రబాబు, ఏనాడూ ప్రజల బాగు పట్టించుకోలేదు. పోలవరం ప్రాజెక్టు పనులను ఏకంగా ఏటీఎంలా వాడుకున్నాడని సాక్షాత్తూ ప్రధాని మోదీ స్వయంగా అన్నారు. చివరకు ఎల్లో మీడియాకు కూడా చంద్రబాబు అవినీతి గురించి స్పష్టంగా తెలుసు. అయినా ఆయననే సమర్థిస్తారు.

ప్రజల సొమ్ము యథేచ్ఛగా తిన్న చంద్రబాబుపై ప్రజలందరికీ కోపంగా ఉంది. చంద్రబాబుకు ఒకప్పుడు కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే ఉంటే, ఇప్పుడు ఆయన ఆస్తి 3 లక్షల కోట్లు. ఈ విషయాన్ని ఒకసారి చంద్రబాబే స్వయంగా చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా, అమరావతిలో యథేచ్ఛ దోపిడికి స్కెచ్‌ వేశారు. కానీ ప్రభుత్వం మారడం వల్ల దానికి బ్రేక్‌ పడిందని మండిపడ్డారు.

కారుమూరి నారా లోకేష్ కు సవాల్ విసిరారు.. ‘లోకేశ్‌.. నీ తండ్రి నిప్పు అని, ఆయన అవినీతి చేయలేదని అంటున్నావు కదా? నీవు దానికే కట్టుబడి ఉంటే, మీ అక్రమ ఆస్తుల మీద సీబీఐ దర్యాప్తును ఎందుకు అడ్డుకున్నారు? స్టే ఎందుకు తెచ్చుకున్నారు? దాన్ని తొలగించుకుని, మీ ఆస్తుల మీద దర్యాప్తు జరపనివ్వండి. అప్పుడే మీ నిజాయితీ, నిబద్ధత అందరికీ తెలుస్తుంది’ అన్నారు. 

చంద్రబాబుకు ఎన్టీ రామారావు శాపం కూడా తగిలింది. అందుకే ఆయన జైలుకు వెళ్ళాడు. చంద్రబాబు జైలుకు పోగానే, పార్టీ పగ్గాల కోసం అప్పుడే నేతలు బయటకు వస్తున్నారు. యనమల రామకృష్ణుడు, నందమూరి బాలకృష్ణ పార్టీ కబ్జా కోసం ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే, నారా లోకేశ్‌కు పార్టీ నడిపే సత్తా లేదు. ఆయనకు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. అందుకే ఎవరికి వారు పార్టీ పగ్గాల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మళ్ళీ ఓటమి తప్పదు అన్నారు. 

తనకు అధికారం అంటే ఏమిటో తెలియదని, లోకేశ్‌ అంటున్నాడని... ఆయన కనీసం ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాలేదని.. దొడ్డిదారిన మంత్రి అయ్యాడన్నారు. స్కిల్‌ స్కామ్‌లో లోకేశ్‌ కూడా దోషి. ఆయనకూ శిక్ష తప్పదని తెలిపారు. 

ఇక దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్‌. ఆయన గతంలో చంద్రబాబుపైనా, తెలుగుదేశం పార్టీపైనా విమర్శలు చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 15 సీట్లు గెలిపించి ఇస్తే.. ఎక్కడికక్కడ దోపిడి చేశారని, తన తల్లిని, కుటుంబాన్ని తిట్టారని గగ్గోలు పెట్టిన పవన్‌కళ్యాణ్‌.. ఇప్పుడు అన్నీ మర్చిపోయి కేవలం చంద్రబాబు కోసమే పని చేస్తున్నారన్నారు. 

ఈ మేరకు వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. ఆ తరువాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. 

- అసలు బాలకృష్ణకు బుర్ర ఉంటే.. ఆ రోజు ఆయనే పార్టీని తన స్వాధీనంలోకి తీసుకునేవాడు. తన తండ్రి నంచి పదవి లాక్కున్నా.. ఊరికే ఉన్నాడు. తన బావ చంద్రబాబును సమర్థించాడు. 

- చంద్రబాబుకు అరెస్టు భయం పట్టుకుంది కాబట్టే.. ఎప్పటి నుంచో ఢిల్లీ చక్కర్లు కొట్టాడు. ఎలాగైనా బయట పడాలని ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు.

- లోకేశ్‌ ఒక పప్పు. తనకు ఎప్పుడూ ఎవరో ఒకరి సపోర్టు కావాలని, తనకు తన అన్నయ్య (పవన్‌కళ్యాణ్‌) సపోర్టు కావాలని కోరుకుంటున్నాడు. కానీ ఆయనేం చేయగలడు? ఆయన పార్టీపై ఆయనకే పట్టు లేదు.

- చంద్రబాబును మేము అరెస్టు చేయించామని అంటున్నారు. ఆ ఆదేశాలు ఇచ్చింది, ఆయనను కస్టడీకి పంపించింది కోర్టు కదా?

- ఏ ఒక్క లాయర్‌ అయినా, చంద్రబాబు అవినీతి చేయలేదంటున్నారా? ఎంతసేపూ చంద్రబాబు అరెస్టు అంశాన్ని ప్రస్తావిస్తున్నారని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గుర్తు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios