ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యానికి గాను నగదు బదిలీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ మేరకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివరాలు తెలిపారు. సాంకేతిక కారణాలతో నగదు బదిలీ వాయిదా వేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఏపీలో రేషన్ బియ్యానికి నగదు బదిలీ (money for ration) వాయిదా వేసింది జగన్ సర్కార్ (ys jagan govt) . సాంకేతిక కారణాలతో నగదు బదిలీ వాయిదా వేస్తున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageswara rao) . నగదు బదిలీపై నిర్ణయం తీసుకుంటే తెలుపుతామని.. రైతుల కల్లాల వద్దకే వెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి తెలిపారు. ఫోర్టెట్ బియ్యాన్ని ప్లాస్టిక్ బియ్యం అనుకోవద్దన్నారు. పది రోజుల్లో రైతులకు ధాన్యం డబ్బులు అందిస్తామన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.
మరోవైపు రాష్ట్రంలో ఈ పథకం తెస్తారనే ప్రచారం మొదలైన దగ్గర నుంచి ప్రజల్లో మరో అనుమానం మొదలైంది. ఒకవేళ బియ్యం వద్దని చెప్పి.. డబ్బు ఒకసారి తీసుకుంటే.. భవిష్యత్తులో కార్డులు కట్ చేసే ప్రమాదం ఉందనే భయం కూడా వెంటాడుతోంది. బియ్యం అవసరం లేని వారికి బియ్యం ఎందుకని ప్రభుత్వం భావించి.. కార్డుల్లో కోత వేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ప్రభుత్వం బియ్యానికి బదులు నగదు ఇవ్వాలన్న ప్రతిపాదన వెనుక కార్డుల్లో కోత విధించాలన్న వ్యూహం ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
దీంతో లబ్దిదారుల్లోనూ అదే ఆందోళన మొదలైంది. దీనిపై మంత్రి నాగేశ్వరరావు వివరణ ఇచ్చారు. విపక్షాలు చెప్తున్నది నిజం కాదని, ఎవరి కార్డులూ పోవడం కాదని... కోత విధించడం కానీ వుండదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ నగదు కూడా మహిళల ఖాతాల్లోనే జమ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు పనిగట్టుకుని అపోహలు ప్రచారం చేస్తున్నాయని కారుమూరి మండిపడ్డారు.
