సెప్టెంబర్‌లో జగన్ విశాఖకు వెళ్లడం ఖాయమన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు . వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని కారుమూరి ప్రశంసించారు.

సెప్టెంబర్ నుంచి విశాఖలోనే కాపురం పెడతానని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు స్పందించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో జగన్ విశాఖకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబు మళ్లీ పేదలను మోసం చేసే కార్యక్రమం చేపట్టారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రజల్లో నుంచి వచ్చిన వ్యక్తి కాదని.. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, పార్టీని, బ్యాంక్ బ్యాలెన్స్‌ను లాక్కొని అధికారాన్ని అందుకున్నారని మంత్రి ఆరోపించారు. టీడీపీ హయాంలో రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి మోసం చేశారని కారుమూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్ జగన్ తన పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి.. ఇచ్చిన హామీలన్ని నెరవేర్చారని కారుమూరి నాగేశ్వరరావు ప్రశంసించారు. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నామని.. అందుకే కరోనా వచ్చినా ప్రజలు ఇబ్బంది పడలేదన్నారు. చంద్రబాబు తల్లికి తలకొరివి పెట్టలేదని, తోడబుట్టినవాడిని బంధించారని కారుమూరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని.. ఆయన త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయంటూ మంత్రి జోస్యం చెప్పారు. మైకు కూడా పట్టుకోలేని స్థితిలో చంద్రబాబు వున్నారని.. జగన్ పాలనలో టీడీపీ, జనసేన కార్యకర్తలకు కూడా సాయం అందిందని గుర్తుచేశారు. 

ALso Read: జగన్ విశాఖ రాకుండా ఎవ్వరూ అడ్డుకోలేరు.. వ్యవస్థలన్నీ ఇక్కడి నుంచే : మంత్రి గుడివాడ అమర్‌నాథ్

ఇకపోతే.. నిన్న మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ జగన్ విశాఖ రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. విశాఖ నుంచే వ్యవస్థలన్నీ పనిచేస్తాయని.. సీఎం పరిపాలనను ఎక్కడి నుంచైనా చేసుకోవచ్చని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. జగన్ విశాఖ రారంటూ టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మే 3న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి జగన్ శంకుస్థాపన చేస్తారని గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ నేతలు విశాఖ పరిపాలనా రాజధానికి వ్యతిరేకమా, అనుకూలమా అన్న దానిని చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు