అమరావతి:ఈఎస్ఐ స్కామ్‌లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని తేలడంతోనే ఆయనను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారని ఏపీ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. మంత్రిగా ఉన్న సమయంలో నకిలీ బిల్లులు సృష్టించి పెద్ద ఎత్తున అచ్చెన్నాయుడు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. 

శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతిని నిరూపించాలని తోడగొట్టిన లోకేష్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. తప్పులు చేసిన వారెవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు. 

అసెంబ్లీ సమావేశాల ముందే అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడంపై కూడ ఆయన స్పందించారు. అసెంబ్లీ సమావేశాల ముందే ఉద్దేశ్యపూర్వకంగా అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారనే వాదనలో వాస్తవం లేదన్నారు.

also read:తప్పు చేసిన వారెవరైనా అరెస్ట్ కావాల్సిందే: మంత్రి జయరాం

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ప్రతి పనిలో కూడ అవినీతి జరిగిందని వైసీపీ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆరోపించారు.అచ్చెన్నాయుడు చేసిన  అవినీతి 150 కోట్ల రూపాయల పైనే ఉంటుందన్నారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా వాటా ఉంటుందని ఆరోపించారు. తన నియోజకవర్గంలో పని చేస్తున్న ఒక ఎస్‌సీ మహిళను తన మాట వినలేదని అచ్చెన్నాయుడు సస్పెండ్ చేయించారన్నారు. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారని గుర్తు చేశారు.

 

చట్టం ముందు అందరూ సమానులే
ప్రజాస్వామ్యంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ట్వీట్‌‌ చేశారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబు, లోకేష్‌.. ఎవరైనా చట్టం ముందు సమానులే అంటూ అంబటి రాంబాబు ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.