జగన్ నిర్ణయాలను విమర్శించడమే కొన్ని పత్రికలు పనిగా పెట్టుకున్నాయని అన్నారు మంత్రి కన్నబాబు. తాడేపల్లిలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో చంద్రబాబు అనేక సార్లు పెట్రోల్‌పై భారం వేశారని గుర్తుచేశారు.

లాక్ డౌన్ సమయంలో కూడా జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని కన్నబాబు చెప్పారు. ఈ సమయంలో రాష్ట్రానికి ఇన్ని నిధులు ఎలా తెస్తున్నారు అని అందరూ ఆశ్చర్యపోతున్నారని మంత్రి వెల్లడించారు.

ఇసుక పై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోయినా విష ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 16 శాతం వైసీపీ వొట్ బ్యాంక్ పడిపోయింది అని చంద్రబాబు అంటున్నారని.. ఆయనకు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సర్వే చేసిన అవే సంస్థలు చెప్పివుంటాయని కన్నబాబు వెల్లడించారు.

ఆ ఓటు బ్యాంక్ అంతా తన వైపుకు మారి ఇప్పుడే సీఎం అయ్యేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకోవడం కోసం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని... న్యాయ వ్యవస్థ పై మాకు, జగన్ కు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి స్పష్టం చేశారు.

దమ్మాలపాటి శ్రీనివాస్ కేసులో హైకోర్ట్ తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని... ఎఫ్‌ఐఅర్ నమోదు అయితే వాటి వివరాలు బయటకు రానివ్వొద్దు అనడం ఆశ్చర్యం కలిగిస్తోందని కన్నబాబు పేర్కొన్నారు.

గతం లో ఎక్కడా కూడా ఇలాంటి కోర్ట్ ఆర్డర్ రాలేదు మంత్రి వ్యాఖ్యానించారు. చర్చ జరుగుతున్న సమయంలో స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని అందుకే మాట్లాడుతున్నామని ఆయన వెల్లడించారు.

రేపు వేరే కేసుల్లో కూడా ఇలాంటి తీర్పు ఇస్తారా అని చర్చ జరుగుతుందన్నారు. తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం ఇలాంటి చర్చ మంచిదేనని కన్నబాబు చెప్పారు. మీడియా పై ఆంక్షలు విధిస్తారా అని కోర్ట్‌లు గతం లో ప్రశ్నించాయని.. దేశవ్యాప్తంగా ఒక వ్యవస్థల పట్ల చర్చ జరుగుతోందని ఆయన వెల్లడించారు.

మంత్రివర్గ ఉపసంఘాన్ని శాసన సభ నిర్ణయిస్తుందని.. శాసన సభ కి కొన్ని హక్కులు ఉంటాయని కన్నబాబు వెల్లడించారు. మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేయకూడదని కోర్ట్ ల జోక్యం పై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

గత ప్రభుత్వం నిర్ణయాల పై సమీక్ష అధికారం లేదు అంటే అన్ని ప్రభుత్వాలు విచ్చలవిడిగా వ్యవహరిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. విశాఖ గ్యాస్ లీక్ ఘటన తర్వాత స్టైరిన్ అక్కడ నుండి తరలించాలని సీఎం ఆదేశించారని... అందరూ ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తే.... ఎందుకు తరలించారు అని వ్యాఖ్యానించారని కన్నబాబు ధ్వజమెత్తారు.

పార్లమెంట్‌లో తమ నాయకులు ఈ అంశం పై మాట్లాడారని ఆయన గుర్తుచేశారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పేరిట కొన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని... రాజ్యాంగానికి లోబడి పని చేస్తున్న ప్రభుత్వాని కి అడుగడుగునా అడ్డుపడితే ఎలా? అని మంత్రి ప్రశ్నించారు.

ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోకపోతే ప్రతిపక్ష నేత చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారా? అని కన్నబాబు సెటైర్లు వేశారు. గత ప్రభుత్వాల నిర్ణయాలు సమీక్షించకపోతే 2 జి స్కాం బయటకు వచ్చేదా? అని ఆయన నిలదీశారు.

రమేష్ హాస్పిటల్ లో మనుషులు చనిపోతే ప్రభుత్వం స్పందించకూడదా అని మంత్రి ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ మరియు శాసన వ్యవస్థ మద్య ఏదో జరిగపోతుందని చూపించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని కన్నబాబు ఆరోపించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఇలాంటి గ్యాగ్ ఆర్డర్స్ రాలేదని మంత్రి గుర్తుచేశారు.