ఏకగ్రీవ ఎన్నిక సంప్రదాయానికి జగన్ తూట్లు పొడుస్తున్నాడంటూ చంద్రబాబు దగ్గర నుండి మంత్రి అఖిలప్రియ, తదితరులు రోజూ ఎందుకు గోల చేస్తున్నట్లు? అధికారాన్ని అడ్డం పెట్టుకుని నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో  స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో గెలిచినట్లు నంద్యాలలో సాధ్యం కాదన్న విషయం అర్ధమైపోయిందా?

విద్యుత్ శాఖమంత్రి కళావెంకట్రావు మేకపోతు గాంభీర్యాన్ని బాగానే ప్రదర్శిస్తున్నారు. కళా మాటలు వింటుంటే పార్టీలోని డొల్లతనాన్ని కప్పిపుచ్చుకునేందుకు చెబుతున్న మాటలుగా అర్ధమైపోతోంది. ఈరోజు చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో సమన్వయ కమిటీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ నంద్యాల ఉపఎన్నికలో ఎన్నిపార్టీలు పోటీ చేసినా విజయం మాత్రం టిడిపిదే అంటూ చెప్పారు. సరే, కళా చెప్పిందే నిజమనుకుందాం కాసేపు.

ఉపఎన్నికలో పార్టీ విజయంపై అంత ధీమా ఉన్నపుడు ఏకగ్రీవం కోసం అంత పాకులాడుతున్నదెందుకు? ఒకటికి పదిసార్లు శిల్పామోహన్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించిన వైసీపీ అథ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని శాపనార్ధాలు పెట్టటం ఎందుకు? ఏకగ్రీవ ఎన్నిక సంప్రదాయానికి జగన్ తూట్లు పొడుస్తున్నాడంటూ చంద్రబాబు దగ్గర నుండి మంత్రి అఖిలప్రియ, తదితరులు రోజూ ఎందుకు గోల చేస్తున్నట్లు? అధికారాన్ని అడ్డం పెట్టుకుని నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాల్లో స్ధానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో గెలిచినట్లు నంద్యాలలో సాధ్యం కాదన్న విషయం అర్ధమైపోయిందా?

ఒకవైపు స్వయంగా చంద్రబాబే నంద్యాలలో పాల్గొన్న ఇఫ్తార్ విందు రాజకీయం విఫలమైంది. అందుకే ఓటర్లనే బెదిరిస్తున్నట్లు మాట్లాడారు. దానికితోడు అభ్యర్ధి భూమా బ్రహ్మానందరెడ్డి ఎక్కడ ప్రచారం చేస్తున్నా ఓటర్లు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. టిడిపికి ఓట్లేసేది లేదంటూ మొహం మీదే చెప్పేస్తున్నారు. ఈ విషయాలన్నీ ఎప్పటికప్పుడు చంద్రబాబుకు రిపోర్టుల రూపంలో అందుతూనే ఉన్నాయి. ఆ అసహనమే ఈరోజు మళ్ళీ చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది. దాన్ని కవర్ చేసుకునేందుకే కళావెంకట్రావు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు కనబడుతోంది.