టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రపై సెటైర్లు వేశారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. లోకేష్ పాదయాత్ర చేస్తున్నట్లుగా లేదని.. వాకింగ్‌లా వుందని వ్యాఖ్యానించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేస్తున్న యువగళం పాదయాత్రపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... యువగళం పాదయాత్ర అట్టర్ ఫ్లాప్ అని టీడీపీ నేతలే అనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో 24 లక్షల మంది ఓటర్లు వుంటే.. కనీసం ఒక్క శాతం కూడా లోకేష్ పాదయాత్రలో పాల్గొనలేదన్నారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నట్లుగా లేదని.. వాకింగ్‌లా వుందని కాకాణి గోవర్ధన్ రెడ్డి సెటైర్లు వేశారు.
వైఎస్సార్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నారని.. అందుకే జనం మరోసారి పట్టం కట్టారని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం బీజేపీతో మరోసారి చేతులు కలపబోతున్నారని.. ఆయనలా జగన్ బీజేపీ దగ్గర సాగిలపడలేదని కాకాణి వ్యాఖ్యానించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు బయటకు పోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదని, కేడర్ చెక్కు చెదరదని గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.
ALso Read: నిన్ను మాల జాతి ఎన్నటికీ క్షమించదు జగన్ రెడ్డి... :మాజీ మంత్రి ఆనంద్ బాబు
కర్ణాటక ఎన్నికల్లో పలు పార్టీలు ఇచ్చిన హామీలను కాపీ కొట్టి చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని ఆయన ఆరోపించారు. యువగళంలో యువకులు కాకుండా అంతా ముసలివారే వున్నారని గోవర్థన్ రెడ్డి సెటైర్లు వేశారు. గతంలో మోడీని తిట్టి.. ఇప్పుడు ఆయన దగ్గరికే వెళ్లాలని బాబు అనుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాకాణి స్పష్టం చేశారు. కేంద్రంతో సఖ్యతగా మెలుగుతూనే జగన్ రాష్ట్రానికి నిధులు తీసుకొస్తున్నారని మంత్రి తెలిపారు. 2019లో మోడీకి వ్యతిరేకంగా ధర్మ ధీక్షలు చేసిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రధాని కాళ్లు పట్టుకుంటున్నారని చురకలంటించారు.
